
బూతు సినిమా వల్ల సమాజానికి ఎంత హాని.. ఇది ఎప్పటినుండో వినబడుతున్న మాట. కానీ ఒక సినిమా విషయంలో ఇలాంటి మాటలు ఎన్ని ఎక్కువుగా వినిపిస్తే.. ఆ సినిమా అంత బాగా హిట్ అవుతుంది. నిజానికి ఇప్పటి సమాజానికి కావాల్సింది బూతు సినిమాలే అని ‘కె. విశ్వనాద్’ లాంటి దిగ్గజ దర్శకుడు ఓ సందర్భంలో బాధతో అన్నారు అంటేనే.. ఇప్పుడు బూతు సినిమాలకు ఉన్న డిమాండ్ ను ఊహించొచ్చు. అందుకే ఓ బూతు సినిమాని తెలుగులోకి భారీ ఎత్తున తెస్తున్నారు. పైగా ఈ సినిమా కోసం రెండు పెద్ద సంస్థలు పోటీ పడుతున్నాయట.
ఇంతకీ ఆ సినిమా ఏది అంటే.. బాలీవుడ్ లో తెరకెక్కిన ‘పతి పత్ని ఆర్ ఓ’. మినిమమ్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ లో కోట్ల వసూళ్లను వసూలు చేసి, ట్రేడ్ వర్గాలకే షాక్ ను ఇచ్చింది. కేవలం బూతు కంటెంట్ తో తెరకెక్కిన సినిమా కావడంతోనే ఆ సినిమాకు ఆ రేంజ్ క్రేజ్ వచ్చి కలెక్షన్స్ వచ్చాయని తేల్చి చెప్పాయి బి టౌన్ వర్గాలు. నిజమే ఈ రోజుల్లో బడ్జెట్ కంటే.. అలాగే కంటెంట్ కంటే కూడా సినిమాలో మంచి బూతు ఉంటే.. ఆ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. పైగా సినిమాలో ఎలాంటి కొత్తదనం లేకపోయినా.. ఇంట్రస్ట్ గా సాగే బూతు కంటెంట్ ఉంటే చాలు, సినిమాని హిట్ చేస్తున్నారు జనం.
పైగా బూతు సినిమాలో హీరోలు, స్టార్స్ తో కూడా పనిలేదు. తీసుకున్న కథలో బూతుకి మంచి స్కోప్ ఉండాలి, అలాగే చూపించే బూతుకి మంచి రీజన్ ఉండాలి.. చాలు. అది చిన్న బడ్జెట్ సినిమానా ? స్టార్స్ నటించిన సినిమానా ? లాంటి లెక్కలను అసలు పట్టించుకోరు ప్రేక్షకులు. ‘పతి పత్ని ఆర్ ఓ’ సినిమా కూడా అలాంటి సినిమా కాబట్టే.. దేశవ్యాప్తంగా విడుదలై రికార్డ్ స్థాయిలో వసూళ్లను సాధించింది. అందుకే ఇప్పుడు తెలుగులోకి ఈ సినిమాని తేవడానికి, హారిక హాసిని సంస్థతో పాటు గీత ఆర్ట్స్ 2 సంస్థ కూడా పోటీకి దిగాయి.