కరోనా ఎంత భయంకరమైనదో దాని వల్ల నష్టపోయిన వారికే తెలుస్తోంది. ముఖ్యంగా కరోనాతో ప్రాణాలను పోగొట్టుకున్న కుటుంబాలలో కరోనా ఇప్పటికీ నరకం చూపిస్తోంది. అలాగే కరోనా వల్ల చావుబతుకుల మధ్య నలిగిపోతున్నవారికే అర్ధమవుతుంది అది ఎంత బాధాకరమైనదో ? అదేవిధంగా సరిగ్గా మరో వారంలో డెలివరీ అనగా.. కరోనా బారినపడితే ఆ తల్లి ఎంతగా భయపడి ఉంటుంది ? ఆ కుటుంబం ఎంతగా నలిగిపోయి ఉంటుంది ?
ప్రముఖ నటి హరితేజ ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆమె కరోనా కారణంగా ఎంతగా నరకం అనుభవించిందో తాజాగా ఇన్‌స్టా వేదికగా తెలియజేసింది. డెలివరీ సమయంలో హరితేజ ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఓ భావోద్వేగ వీడియోలో చెబుతూ ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఆ వీడియోలో డెలివరీకి కొన్నిరోజుల ముందు తమ ఇంటిల్లిపాది కరోనా బారిన పడ్డామని, ఆ సమయంలో తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని హరితేజ చెప్పుకొచ్చింది. అలాగే కరోనా విషయంలో కొంతమంది ఇంకా నిర్లక్ష్యంగానే ఉన్నారంటూ హరితేజ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె మాటల్లోనే ‘డెలివరీకి సరిగ్గా వారం రోజుల ముందు హాస్పిటల్ కి వెళ్లాను. డాక్టర్లు పరీక్షలు చేసి బేబీ ఆరోగ్యంగా ఉంది, సాధారణ డెలివరీ అవుతుందని చెప్పారు. అప్పుడు నేను చాల ఆనందపడ్డాను అని చెప్పింది.
అయితే డెలివరీ సమయం దగ్గర పడే టైంలో హరితేజ ఫ్యామిలీ మొత్తానికి కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పుడు హరితేజ పడిన ఆవేదనను ఆమె మాటల్లోనే.. ‘ఆ సమయంలో నేను ఎంతో కంగారుగా, భయంగా అనిపించింది. అప్పటివరకూ నాకు వైద్యం అందించిన డాక్టర్లు డెలివరీ చేయలేమని చెప్పారు. దాంతో నేను కొవిడ్ హాస్పిటల్ లో చేరాను. సర్జరీ చేయాల్సి వచ్చింది. నాకు పాప పుట్టింది. పాపకు కొవిడ్ పరీక్ష చేయగా నెగటివ్ గా నిర్ధారణ అయినప్పుడు నేను ఊపిరి పీల్చుకున్నాను. దాంతో పాపని నాకు దూరంగా ఉంచారు. రోజూ వీడియో కాల్స్ చేసి పాపని చూసేదాన్ని. పాపకు పాలు ఇవ్వలేకపోతున్నానే అని చాల బాధ పడ్డాను. చికిత్స అనంతరం నన్ను ఇంటికి పంపించారు. దేవుడు దయ వల్ల మా ఇంట్లో వారందరికీ నెగటివ్ వచ్చింది’’ అని హరితేజ చెబుతూ భావోద్వేగానికి లోనైంది.