
Hamida Khatoon Bigg Boss 5: తెలుగు ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ఘనంగా ప్రారంభమైంది. ఒక్కొక్కరుగా కంటిస్టెంట్లను పరిచయం చేసిన హోస్ట్ నాగార్జున.. హౌస్ లోకి పంపించారు. అయితే.. కంటిస్టెంట్లలో అందరికీ తెలిసిన వారున్నారు.. పెద్దగా తెలియని వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఒకరే హమీదా ఖాతూన్. మరి, ఎవరీ హమీదా? ఆమె బయోగ్రఫీ ఏంటి? అన్నది చూద్దాం.
నిజానికి.. హమీదా ఖాతూన్ తెలుగు ప్రేక్షకులకు కొత్తేం కాదు. కానీ.. వారు సరిగా గుర్తించుకునే పాత్రలు దక్కలేదు ఆమెకు. టాలీవుడ్ లో సినిమాలు చేసినప్పటికీ.. తగిన గుర్తింపు రాలేదు. అందుకే.. బిగ్ బాస్ ద్వారా మరోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు ట్రై చేస్తోంది. హమీదా ఖాతూన్ బెంగాలీ. 1993లో జన్మించింది. కోల్‌కతాలోనే ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ చేసింది.
చదువు పూర్తయిన తర్వాత 2013లో హైదరాబాద్ కు మకాం మార్చింది. తెలుగు సినిమాల్లో ఛాన్సుల కోసం బాగానే ప్రయత్నించింది. ఈ క్రమంలోనే 2015లో తొలి అవకాశం దక్కింది. ‘సాహసం చేయరా డింభకా’ సినిమాతో నట జీవితం మొదలు పెట్టింది. ఆ తర్వాత ‘భద్రం బీకేర్ ఫుల్ బ్రదర్’ సినిమాలోనూ నటించింది. అయితే.. ఈ రెండు చిత్రాలూ ఆమెకు బ్రేక్ ఇవ్వలేకపోయాయి. దీంతో.. టాలెంట్ ఉన్నా, మరుగున పడిపోయింది హమీదా.
పర్సనల్ విషయానికి వస్తే.. హెల్త్ ఈజ్ వెల్త్ అంటుంది హమీదా. ఆరోగ్యాన్ని మించింది లేదని చెబుతుంది. ఇక, తనో ఇంటీరియర్ డిజైనర్. ఈ రంగంపైనా దృష్టిసారించిన హమీదా.. సినిమాల్లోనూ అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమెతో మాట్లాడిన నాగార్జున.. నువ్వు చూడ్డానికే కాదు.. నీ మనసు కూడా అందంగానే ఉందని పొగిడేశాడు నాగ్.
మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించింది హమీదా ఖాతూన్. మరి, ఎలాంటి గేమ్ ఆడుతుంది? టైటిల్ రేసులో ఎంత వరకు దూసుకెళ్తుంది? బిగ్ బాస్ ద్వారా ఎలాంటి అవకాశాలను అందిపుచ్చుకుంటుంది? అన్నది చూడాలి.