Gunasekhar Warns Rana and Trivikram : టాలీవుడ్ లో కొత్త వివాదానికి తెరలేచింది. నిన్న హీరో రానా హిరణ్యకశ్యప టైటిల్ తో పాన్ ఇండియా మూవీ ప్రకటించారు. కాన్సెప్ట్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ ప్రాజెక్ట్ కి రానా నిర్మాత కూడా అని తెలుస్తుంది. ఇక త్రివిక్రమ్ కథను సమకూరుస్తున్నారని తెలియజేశారు. దాంతో ఇది రానా-త్రివిక్రమ్ ల కాంబోలో తెరకెక్కను ప్రాజెక్ట్ గా ప్రచారం అవుతుంది. అయితే గుణశేఖర్ ఈ ప్రాజెక్ట్ ప్రకటించి చాలా కాలం అవుతుంది. 2019లో రానా హీరోగా హిరణ్యకశిప అనే పౌరాణిక చిత్రం చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు.
ఏళ్ళు గడిచినా రానా-గుణశేఖర్ మూవీ కార్యరూపం దాల్చలేదు. సడన్ గా రానా అదే ప్రాజెక్ట్ వేరే వాళ్లతో ప్రకటించడం వివాదాస్పదమైంది. రానా హిరణ్యకశ్యప ప్రకటించిన కాసేపటికే గుణశేఖర్ సోషల్ మీడియాలో స్పందించారు. ఆయన పరోక్షంగా రానా, త్రివిక్రమ్ లకు నైతికత లేదు. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడని అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. నేడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గుణశేఖర్ నేరుగా అసహనం బయటపెట్టారు.
నేను హిరణ్యకశిప సబ్జెక్టుతో రానాను కలిశాను. వారు చేద్దాం అన్నారు. కారణాలు ఏమైనా రానా మూవీ చేయలేదు. కాబట్టి నా కథతో నేను వేరే వాళ్లతో మూవీ చేసుకుంటాను. కానీ నా కథను, థీమ్ ని తీసుకుని మూవీ చేస్తే ఒప్పుకోను. అది నైతిక కాదు. నేను వాళ్ళతో చెప్పిన కథను వాడుకుని సినిమా తీస్తారని నేను అనుకోవడం లేదు. ఒకవేళ తీస్తే ఒప్పుకోను . పరిశ్రమ నైతిక విలువల మీద ఆధారపడి నడుస్తుంది. ఆ విలువలు వాళ్ళు వదిలేస్తారని అనుకోవడం లేదు.
భావ దారిద్య్రం కాకపోతే హిరణ్యకశిప సబ్జెక్టునే వాళ్ళు చేయాలా. అయినా పర్లేదు. హిరణ్యకశిప కథను వాళ్ళ కోణంలో తెరకెక్కించుకుంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదని గుణశేఖర్ అన్నారు. గతంలో ఇదే సబ్జెక్టు గురించి గుణశేఖర్ మాట్లాడుతూ.. నేను హిరణ్యకశిప కథ మీద రెండేళ్లు పని చేశాను. కొన్నేళ్లు ప్రీ ప్రొడక్షన్ కోసం కేటాయించాను. రానా చేసినా చేయకున్నా ఆ కథ నాది అన్నారు. రానాతో ఈ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉండగా డైలాగ్స్ రాస్తానని త్రివిక్రమ్ తనంతట తానే వచ్చినట్లు గుణశేఖర్ చెప్పుకొచ్చారు.