Best Villains : సినిమాలో ప్రతినాయకుడి ( Villain) పాత్ర చాలా కీలకం. కథాపరంగా కథానాయకుడు వేసే ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో విలన్ రూటే సెపరేటుగా ఉండాలి. ఈ విలన్ పాత్రలను ఆసక్తికరంగా మలచడం అనేది ఒక రకంగా సవాలే. అందుకే వారికంటూ ఒక ప్రత్యేకమైన ట్రాక్‌ను దర్శకులు తమ సినిమాలలో నడుపుతుంటారు. కానీ నేడు అనేక సినిమాలలో విలన్ అంటే కేవలం జోకర్ లేదా చేతకాని చవట మాత్రమే. అయితే చాలాసార్లు విలన్, హీరో కంటే శక్తిమంతుడు అని తెలియజేసిన పాత్రలు కొన్ని ఉన్నాయి.
‘అగ్నిపథ్’ చిత్రంలో సంజయ్ దత్ పోషించిన కాంచా పాత్ర ఒక వైవిధ్యమైన పాత్ర. సంజయ్ తన బానిసలతో ఒక సామ్రాజ్యాన్నే నడుపుతుంటాడు. పైగా హత్యలకు కేరాఫ్ అడ్రస్ ఆ కాంచా స్థావరం. చూడడానికే ఎంతో భయంకరంగా ఉండే, ఆ నరరూప రాక్షసుడిని చంపడం అంటే మాటలా? కానీ హీరో చంపుతాడు. అప్పుడు నిజంగానే హీరో అవుతాడు.
వర్షం సినిమాలో హీరో ప్రభాస్‌తో సరిసమానంగా నటించిన ప్రతినాయకుడు గోపిచంద్. ఆ పాత్రలో గోపీచంద్ అద్భుతంగా రాణించాడు. ఒక రకంగా చెప్పాలంటే హీరోకి సరైన సవాల్ విసిరిన పాత్ర. ఎత్తుకు పై ఎత్తులు వేయగల ఒక సాఫ్ట్ విలనిజం ఈ పాత్రలో మనకు కనిపిస్తుంది. ఈ సినిమాకు ముందే జయం, నిజం సినిమాలలో విలన్ గా రాణించి మెప్పించాడు గోపిచంద్.
తమిళ సినిమా బోగన్ లో ప్రతినాయకుడిగా నటించిన అరవిందస్వామి, విలనిజానికి ఒక కొత్త అర్థం చెప్పాడు. ఒకానొక సందర్భంలో హీరో పాత్రని సైతం, ఈ విలన్ పాత్ర ముప్పు తిప్పలు పెట్టి, మూడు చెరువుల నీరు తాగిస్తుంది. ప్రేక్షకుడిలో ఉత్సుకతను రేపుతుంది. ఇలాంటి విలన్లే ఇప్పుడు తెలుగు సినిమాకు అవసరం.
ఎందుకో ఈ మధ్య తెలుగు సినిమాల్లో విలన్లు బలంగా ఉండటం లేదు. అంతా సేఫ్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తుంది. ఏది ఏమైనా విలనిజం పెరిగితేనే హీరోయిజం ఉంటుంది.