
మామూలుగా ప్రధాన మీడియా సంస్థలైన పత్రికలు, టీవీ చానెళ్లను చూసి అందరూ భయపడుతారు. జర్నలిస్టులతో ఎందుకు పెట్టుకోవడం అని బెదిరిపోతారు. వాళ్లతో పెట్టుకుంటే మన గుట్టు మట్లు అన్ని బయటకు లాగుతారని.. ఎక్కడైనా దొరికితే చీల్చిచెండాడుతారని వెనక్కి తగ్గుతారు. కానీ అందరూ నడిచే దారిలో నడిస్తే ఏముంటుంది. సంచలన ఫైర్ బ్రాండ్ హీరో విజయ్ దేవరకొండ మీడియాతో సై అన్నాడు. తొడగొట్టాడు. తనపై తప్పుడు వార్తలు రాసిన ఓ తెలుగు టాప్ వెబ్ సైట్ ను ఢీకొట్టాడు. అసలే అగ్రెసివ్ గా ఉండే విజయ్ ఆధారాలతో సహా ఏకిపారేసే సరికి.. చాన్నాళ్లుగా మీడియా చేష్టలకు విసిగి వేసారిన టాలీవుడ్ కూడా అతడితో ఏకమైంది.. చిరంజీవి నుంచి మహేష్ సహా అగ్రహీరోలు.. కొరటాల నుంచి హరీష్ శంకర్ దాకా అగ్రదర్శకులు, నటులు సినీ ప్రముఖులు విజయ్ దేవరకొండకు అండగా నిలిచారు. దీంతో సినీ ఇండస్ట్రీ యుద్ధం ప్రకటించేసరికి సదురు వెబ్ సైట్ కు ఫేస్ గా ఉండే సీనియర్ జర్నలిస్ట్ బెదిరిపోయాడు. తనే అభాసుపాలయ్యానని కలత చెంది ఏకంగా రాజీనామా చేశాడు. ఇప్పుడు జర్నలిస్ట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
*విజయ్ దేవరకొండతో వెబ్ సైట్ కు అసలు ఏంటీ వివాదం.?
టాలీవుడ్ తెరపైకి దూసుకొచ్చిన విజయ్ దేవరకొండ తెరమీదే కాదు.. తెర బయట కూడా అంతే అగ్రెసివ్ గా ఉంటారని పేరుంది. కరోనా టైంలో ఉపాధి లేక తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బందులు పడుతున్న మధ్య తరగతి కుటుంబాలకు సహాయం అందించేలా ‘ది దేవరకొండ ఫౌండేషన్ ’ స్థాపించి అందులో మధ్యతరగతి ప్రజలకు తన సంస్థ ద్వారా సహాయం అందిస్తున్నాడు. దీనిపై తాజాగా తెలుగు టాప్ వెబ్ సైట్ తప్పుడు కథనాలు రాసింది. తనను ఇంటర్వ్యూ అడిగారని.. ఇవ్వను అన్నందుకు కక్షగట్టి ఇలా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని విజయ్ ఆరోపించారు. తాజాగా విడుదల చేసిన వీడియోలో ఆ టాప్ వెబ్ సైట్ రాసిన కథనాలు చదివి మరీ వాటిని కడిగిపారేశారు. ఓ ముసాలాయన సీనియర్ జర్నలిస్టు ఉన్నాడని.. ఆయనకు కళ్లు కనిపించక రాశాడో తెలియదని దుమ్మెత్తిపోశాడు. విజయ్ వీడియో వైరల్ అయ్యింది. ఈ విషయంలో టాలీవుడ్ మొత్తం కదిలివచ్చి విజయ్ కు అండగా నిలబడింది.
వైజాగ్ ఘటనపై కేటీఆర్ దిగ్భ్రాంతి!
*విజయ్ కి అండగా సినీ ఇండస్ట్రీ
విజయ్ దేవరకొండ రేపిన కామెంట్స్ టాలీవుడ్ లో చర్చనీయాంశమయ్యాయి. ఆ వేడి మెల్లిగా అంటుకొని టాలీవుడ్ లో అంటుకుంది. ఒక్కరొక్కరుగా బయటకు వచ్చి విజయ్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ సహా కొరటాల, హరీష్ శంకర్, చిరు, అనిల్ రావిపూడి, రవితేజ అల్లరి నరేష్ ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం విజయ్ కు తమ మద్దతు ప్రకటించారు. తాజాగా నాగబాబు అయితే జలగల్లా మమ్మల్ని పట్టుకొని రక్తం తాగుతున్నారని ధ్వజమెత్తారు.
*ఆ టాప్ జర్నలిస్టు రాజీనామా..
తెలుగులోనే టాప్ వెబ్ సైట్ కు ఇప్పుడు ఆ సీనియర్ జర్నలిస్టు వీఎస్ఎన్ మూర్తి అన్నీ తానై నిలుస్తున్నారు. ఆ సైట్ ముఖంగా ఆయన పేరే వినిపిస్తోంది. ఎవరిని ఇంటర్వ్యూ చేయాలన్నా.. ప్రత్యేకమైన వ్యాసాలు రాయాలన్నా ఆయనే చేస్తారు. ఓ రకంగా ఆ సైట్ కు కర్త కర్మ క్రియ ఆయనే లాగా బయటకు కనపడుతారు. ఆ సైట్ లో ఎంతో మంది జర్నలిస్టున్నా.. బయటకు ఫోకస్ అయ్యింది మాత్రం వీఎస్ఎన్ మూర్తినే. విజయ్ దేవరకొండ కూడా ఈయనే నానా మాటలు అనడంతో మూర్తి నొచ్చుకున్నాడు. ఇన్నేళ్ల జర్నలిజంలో తాను ఇంతలా అభాసుపాలు కాలేదని.. సినీ ఇండస్ట్రీ మొత్తం అనడంతో కలత చెందానని.. ఈ 70 ఏళ్ల వయసులో తనకు ఇంత అవమానాలు అవసరమా అని సదురు టాప్ వెబ్ సైట్ కు రాజీనామా ప్రకటించాడు. ఈ సందర్భంగా సినిమా జర్నలిస్టుల వాట్సాప్ గ్రూపులో ఆయన రాసిన లేఖ ఆయన ఆవేదనకు అద్దం పట్టింది..
మృతుల కుటుంబాలకు భారీ ఎక్స్‌గ్రేషియా!
*వెబ్ సైట్ అండగా ఉన్నా అవమానంతో వైదొలిగాడు..
నిజానికి మూర్తి లాంటి సీనియర్ జర్నలిస్టు ఆ వెబ్ సైట్ కు బలం.. బలగం.. ఎంతో మంది రాజకీయ నేతలు, సినీ ప్రముఖులను బట్టలూడదీసినట్టు చెడమడా రాతలు రాసి డేరింగ్ వెబ్సైట్ గా పేరున్న ఆ సైట్ కు విజయ్ ఆరోపణల వేడి గట్టిగానే తగిలింది.విజయ్ ఆరోపణల తర్వాత రాసిన కథనం డిలీట్ చేసింది. అయితే సినీ ఇండస్ట్రీపై, విజయ్ పై ఘాటుగా కథనాలు రాసి కౌంటర్ ఇచ్చింది. కానీ సీనియర్ జర్నలిస్టు మూర్తి మాత్రం ఆ వెబ్ సైట్ ముఖంగా అందరికీ విలన్ అయ్యారు. అభాసుపాలయ్యారు. సదురు వెబ్ సైట్ యాజమాన్యం మూర్తికి మద్దతు తెలిపి కొనసాగాలని కోరినా.. విజయ్ చేసిన ఆరోపణలు.. వచ్చిన అపఖ్యాతిని ఆయన తట్టుకోలేదు. చివరకు రాజీనామా చేస్తూ వైదొలిగారు.
*మీడియాలో ఇదో అరుదు
తమపై విమర్శలు చేసిన సెలెబ్రెటీలు, రాజకీయ నేతలను ముప్పుతిప్పలు పెట్టే మీడియాలు ఇలా వెనక్కి తగ్గడం చాలా అరుదనే చెప్పాలి. చాలా మీడియాలు, పత్రికలు పంతం పట్టి మరీ వారిని టార్గెట్ చేసి హింసింస్తాయి. తెలంగాణ సీఎం కేసీఆరే ఏం చేయలేక మీడియాను ఆడిపోసుకుంటున్నారు. అలాంటిది విజయ్ దేవరకొండ దెబ్బకు ఒక దమ్మున్న టాప్ వెబ్ సైట్ వెనక్కితగ్గడం.. సీనియర్ జర్నలిస్ట్ మూర్తి వైదొలగడం నిజంగా సంచలనమనే చెప్పాలి. మీడియా చరిత్రలోనే ఇలా వెనకడుగు వేయడం అరుదుగా కనిపిస్తుంటుంది.
-నరేశ్ ఎన్నం