AAA Cinemas: అల్లు అర్జున్ అటు స్టార్ గా వరుస చిత్రాలు చేస్తూనే చిత్ర పరిశ్రమ అనుబంధ వ్యాపారాల్లో అడుగుపెడుతున్నారు. అల్లు స్టూడియోస్ పేరుతో భారీ స్టూడియో నిర్మించారు. తాజాగా AAA సినిమాస్ నిర్మించి థియేటర్స్ రంగంలో ప్రవేశించారు. ఏషియన్ సునీల్ భాగస్వామిగా అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్ నిర్మించారు. అమీర్ పేట్ లో గతంలో సత్యం థియేటర్ ఉండే ప్రాంతంలో దీని నిర్మాణం జరిగింది. సత్యం థియేటర్ కూల్చివేసి AAA సినిమాస్ ఏర్పాటు చేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పూర్తి కాగా నేడు గ్రాండ్ గా లాంఛ్ చేశారు.
అల్లు అర్జున్ చేతుల మీదుగా AAA సినిమా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో అతిథులుగా అల్లు అరవింద్, తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఏషియన్ సునీల్ పాల్గొన్నారు. AAA సినిమాస్ లో మొత్తం ఐదు స్క్రీన్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి అల్ట్రా హెచ్డీ సిస్టమ్ కలిగిన ఎల్ఈడీ స్క్రీన్ అని తెలుస్తుంది. మిగతా స్క్రీన్స్ కూడా ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి.
సినిమా లవర్స్ కి అద్భుతమైన అనుభవం ఇచ్చేలా అత్యాధునిక హంగులతో థియేటర్స్ నిర్మించారు. కట్టిపడేసే ఫర్నిచర్, ఇంటీరియర్ డిజైన్ తో రూపొందించారట. ఒక భారీ ఫుడ్ కోర్టు కూడా లోపల ఉందని సమాచారం. ప్రస్తుతం ఈ థియేటర్స్ లో లేటెస్ట్ చిత్రాల ప్రోమోలు, టీజర్స్, ట్రైలర్స్ ప్రదర్శిస్తున్నారు. మరొక విశేషం ఏమిటంటే AAA సినిమాస్ లో ప్రదర్శించే మొదటి చిత్రం ఆదిపురుష్. ఈ చిత్ర టికెట్ ధర రూ. 295 గా నిర్ణయించారట.
నేడు అమీర్ పేట్ అల్లు అర్జున్ వస్తున్నాడని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు చేరారు. నినాదాలతో ప్రదేశాన్ని హోరెత్తించారు. ఆయన్ని ఫోటోలు, వీడియోలు తీసేందుకు ఆసక్తి చూపారు. అల్లు అర్జున్ రాకతో ఆ ప్రాంతం సందడిగా నెలకొంది. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2లో నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరగా డిసెంబర్ లో విడుదలవుతుందనే ప్రచారం జరుగుతుంది.