Pattabhi : మనం నిన్ననే చెప్పుకున్నాం కదా ఈనాడులో పట్టాభి వార్తకు సంబంధించి పాత ఫోటోలు వాడారని.. ఈనాడు రెడ్ హ్యాండెడ్ గా జగన్ కు దొరికిపోయిందని.. దీనికి చింతిస్తూ రామోజీరావు ఒక సవరణ ప్రకటన కూడా వేశాడు. అయితే అది కూడా కనిపించీ, కనిపించనట్టు చిన్నగా తన పత్రికలో తప్పు జరిగిందని వివరణ ఇచ్చాడు. రామోజీరావు దీనిని ఇక్కడితోనే ఆపలేదు. అసలు తప్పు ఎక్కడ జరిగిందో నిన్నటి నుంచి తవ్వుతూనే ఉన్నాడు. ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు తో ఒక కమిటీ కూడా వేశాడు. సుమారు 8 మంది సభ్యులు ఉన్న బృందం నిన్నటి నుంచి తప్పు ఎక్కడ జరిగిందో శూలశోధన చేశారు.. ఇందులో డెస్క్ ఇన్చార్జి, ఇద్దరు సబ్ ఎడిటర్ల నిర్లక్ష్యం ఉందని తేల్చేశారు.. ఆ ముగ్గురినీ కొలువుల నుంచి తీసిపడేసినట్టు మీడియా సర్కిల్స్ లో ఒక వార్త బయటకు వచ్చింది.. అంటే పులి ప్రతాపం ఉడత పిల్లల మీద చూపించింది అన్నమాట.. మరీ రోజూ ఇలాగే అవాస్తవాలు లక్షల కొద్ది పేజీల్లో ప్రింట్ చేసి ప్రచురిస్తున్నారు కదా.. మరి ఆ పచ్చ యాజమాన్యాలపై కూడా వేటు వేయాలా? అని పలువురు పాఠకులు కూడా గట్టిగానే ప్రశ్నిస్తున్నారు.
మేనేజ్మెంట్ కు పొలిటికల్ లైన్ ఉన్నప్పుడు ఉద్యోగులు కూడా అలానే చేస్తారు కదా! అందులో వాళ్ళ తప్పు ఏముంది. పైగా కిందిస్థాయి ఉద్యోగులు కాబట్టి ఈ యాజమాన్యం దృష్టిలో మంచి మార్కులు సాధించాలని ఉద్దేశంతోనే అత్యుత్సాహంతో పని చేసి ఉంటారు. ఈమాత్రం దానికి వాళ్ళ కొలువులు పీకి పడేస్తే రేపు వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? వాళ్లనే నమ్ముకుని ఉన్న కుటుంబాల పరిస్థితి ఏమిటి? అసలు ఒక పేపర్ పొలిటికల్ లైన్ తీసుకోవడమే పెద్ద తప్పు అని జర్నలిజంలో ఓ నియమం ఉంది.. నాడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రామోజీ రావునే కదా తన పత్రికలో అడ్డగోలుగా రాయించింది. ఆ శ్రీధర్ తో అడ్డగోలుగా కార్టూన్లు వేయించింది. నాడు రామోజీరావు చేసింది రైట్ అయితే..మొన్న విజయవాడ డెస్క్ ఇంచార్జి, సబ్ ఎడిటర్లు కూడా చేసింది కరెక్టే కదా! యదా యజమాన్యం, తదా పాత్రికేయం.
ఈ బుద్ధి అప్పుడు ఏమైంది?
వాస్తవంగా ఈనాడులో టిడిపి బీట్ చేసే రిపోర్టర్లను ఆ పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాయొద్దని యాజమాన్యం నుంచి ఆదేశాలు వెళ్తాయి. ఇందులో ఆంధ్రజ్యోతి కూడా అదే బాపతు. ఆ పార్టీకి వంగి సలాం చేస్తున్నప్పుడు… డెస్క్ లో పనిచేసే ఉద్యోగులు కూడా టీడీపీ కోసం అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. అలా ఫోటో పెడితే తప్పు ఏమిటి? నేను చేసేదే కరెక్టు అని భావిస్తారు. మిగతా వాళ్ళు నన్ను ఫాలో కాకూడదు అని చెబుతున్న రామోజీరావు.. మళ్లీ ఇంతోటి దానికి విలువల సారం, తెలుగు జర్నలిజానికి ప్రమాణాలహారం… ఈ డొంక తిరుగుడు మాటలు దేనికి? అన్నట్టు సాక్షి కూడా ఇందుకు మినహాయింపు కాదు.. కానీ ప్రొఫెషనల్ గా అది ఈనాడు స్థాయికి దిగజారలేదు. అంటే ఇప్పుడు ఈనాడు రాసిన వార్తలని సాక్షి బొంబాట్ చేస్తోంది కాబట్టి రామోజీరావు ఉద్యోగులపై వేటు వేశాడు.. కానీ దీనిని ఓ వర్గం ప్రమాణాల విషయంలో ఎంత నిబద్ధత పాటిస్తుందో సూచిక అని చెబుతుంటే… గురువింద గింజ సామెత చెప్పడానికే… చేయడానికి కాదు.. అని మరో వర్గం అంటోంది. స్థూలంగా చెప్పాలంటే ఆవుల కొట్లాటలో దూడల కాళ్ళు విరిగినట్టు… అటు జగన్, చంద్రబాబు పోరులో ఈనాడు ఉద్యోగులు అంతిమంగా బలయ్యారు. అన్నట్టు ఇప్పుడు లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు కాబట్టి.. ఉద్యోగం కోల్పోయిన ఈనాడు జర్నలిస్టులకు ఏమైనా భరోసా కల్పిస్తాడేమో చూడాలి మరీ..