The economic situation of Telangana : ధనిక రాష్ట్రం కాస్తా.. కరోనా దెబ్బకు ఆర్థిక ఇబ్బందులతో ఆపసోపాలు పడుతోంది. దేశంలోనే సంపన్న రాష్ట్రం అని మురిసిపోయిన సీఎం కేసీఆర్ ను ఇప్పుడు ఆర్థిక సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తెలుగు సినిమాలోలాగా.. ‘అమ్మో ఒకటో తారీఖు’ అని భయపడాల్సిన పరిస్థితులు తెలంగాణలో వచ్చాయి. అన్నింటికి చెల్లింపులు చేసే 1వ తేదీనే చెల్లించాల్సి ఉండడంతో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కిందామీద పడుతోంది.
జూన్ లో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు, వడ్డీలకే సుమారు రూ.10వేల కోట్లు అవసరం అవుతాయి. దీంతోపాటు వానాకాలం పంటకు ఇచ్చే రైతుబంధు కోసం రూ.7600 కోట్లు అవసరం అవుతాయని సమాచారం. మే నెలలోనే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పింఛన్ల చెల్లింపు చాలా ఆలస్యమైంది. దీంతో ఈనెల అసలు చెల్లించడమే కష్టం అంటున్నారు.
ఇక తెలంగాణకు వచ్చే ఆదాయం రోజురోజుకు భారీగా తగ్గుతోంది. ప్రధానంగా పన్నులు, పన్నేతర రాబడి ద్వారా మే నెలలో రూ.10వేల కోట్లకు మించి వచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. వ్యయం మాత్రం దాదాపు రూ.20వేల కోట్లకు పైగానే ఉంది.
తెలంగాణ ప్రభుత్వం అప్పులు తీసుకునేందుకు కేంద్రప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. దీంతో కరోనా తర్వాత అతలాకుతలమైన రాష్ట్ర సర్కార్ కు ప్రతీ నెల ఒక గండంలా గడుస్తోంది. క్లిష్టమైన ఈ జూన్ నెలను కేసీఆర్ సర్కార్ ఎలా అధిగమిస్తుందన్నది కీలకంగా మారింది. జూన్ లో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు, వడ్డీలు, రైతు బంధుకు డబ్బులు వేయడం కేసీఆర్ సర్కార్ తలకు మించిన భారంగా మారింది. నిధుల సేకరణ కానకష్టంగా మారడంతో ఆర్థికశాఖ ఆందోళన చెందుతోంది. జూన్ లోనే సుమారు రూ.20వేల కోట్లు చెల్లించాల్సినవే ఉండడంతో సర్దుబాటు ఎలా అన్న అంశంపై మల్లగుల్లాలు పడుతోంది.
Also Read: Economic Growth: భారత్ ఆర్థిక వృద్ధి ఎందుకు ఆగిపోయింది? అడ్డంకులు ఏమిటీ?
ఏపీ సీఎం జగన్ కేంద్రంతో సఖ్యతతో ఉంటుండడంతో ఏపీకి ఏకంగా తొమ్మిదిన్నర వేల కోట్లు అప్పు తీసుకునే వెసులుబాటును కేంద్రం కల్పించింది. కానీ తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఛాన్స్ ఇవ్వకుండా కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఇక నిన్నటికి నిన్న ఏపీకి జీఎస్టీ పరిహారంలోనూ 3500 కోట్లు ఇస్తే.. తెలంగాణకు కేవలం 300 కోట్లు మాత్రమే ఇచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వానికి సొంతంగా వస్తున్న ఆదాయంతో తప్ప సరిగా చేయాల్సిన చెల్లింపులు అయిన జీతాలు, అప్పులకు వడ్డీలు, పెన్షన్లు లకు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈనెలలోనే రైతు బంధు డబ్బులు వేయాల్సి ఉంది. పల్లె ప్రగతికి నిధులు వెచ్చించాలి. బిల్లుల కోసం సర్పంచ్ లు ఘెరావ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది.
జాతీయ రాజకీయాలంటే కేసీఆర్ చేస్తున్న అతి.. మోడీని ఎదురిస్తుండడం వల్లే తెలంగాణకు రూపాయి ఇవ్వకుండా కేంద్రం ఆర్థికంగా దిగ్బంధం చేస్తోందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఆర్థిక సమస్యలతో పథకాల అమలు నిలిచిపోతే ప్రజా వ్యతిరేకత పెరిగి కేసీఆర్ ఓటమికి దారితీస్తుందని బీజేపీ ప్లాన్ గా కనిపిస్తోంది. అయితే కేసీఆర్ మాత్రం కేంద్రంలోని బీజేపీతో సఖ్యతతో మెలగడానికి సిద్ధంగా లేరు. మరి ఈ తెలంగాణ ఆర్థిక కష్టాలు ఎలా తీరుస్తాడన్నది వేచిచూడాలి.
Also Read: Divya Vani Resigns Row: దివ్యవాణి రాజీనామా ఎపిసోడ్ వెనుక జరిగింది ఇదా?