
రామతీర్థం ఘటన వెనుక రాజకీయ కుట్ర బట్టబయలు అవుతోంది. రామతీర్థం ఘటనలో ముమ్మాటీకి టీడీపీ పాత్ర ఉందని సమాచారం. ఈ మేరకు పోలీసుల విచారణలో అసలు నిజం బట్టబయలు అవుతోంది.
ఆంధ్రప్రదేశ్ లోని ఏ దేవాలయంలో ఘటన జరిగినా అక్కడి వెళ్లని చంద్రబాబుకి.. రామతీర్థం మాత్రమే ఎందుకు వెళ్లాలని అనిపించిందో అసలు విషయం బయటపడింది. రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసం చేసింది తెలుగుదేశం పార్టీ నేతలే అని తేలడం ఇప్పుడు సంచలనంగా మారింది. రాష్ట్రంలో పదే పదే దేవాలయాల్లో విధ్వంసాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు రామతీర్థంలో టీడీపీ నేతలు అడ్డంగా దొరకడంతో ఇన్నాళ్లుగా రాష్ట్రంలో దేవాలయాలపై దాడుల వెనుక రాజకీయ కుట్ర బయటపడినట్టైంది.
విజయనగరం జిల్లా రామతీర్థం దేవస్థానం వెనుకున్న బోధికొండపైనున్న శ్రీరాముడి విగ్రహాన్ని గత నెల 28న ధ్వంసం చేశారు.గత నెల 30న సీఎం జగన్ మోహన్ రెడ్డి విజయనగరం జిల్లాలో పర్యటించడానికి ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి ఒక్కరోజు ముందు ఈ ఘటన జరగడం అనేక అనుమానాలకు తావిచ్చింది. దాంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఈ ఘటనపై విచారణ జరిపారు. వారం రోజుల్లో పోలీసులు అనేకమంది రామతీర్థం గ్రామస్థులను విచారించారు. వారిలో 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో అత్యధికులు టీడీపీ నేతలే ఉండడం అందరినీ షాక్ కు గురిచేసింది.
రామతీర్థం గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ , మాజీ వార్డ్ మెంబర్ సహా మరికొందరు టీడీపీ నేతలు ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. ఈ ఘటనలో టీడీపీ పాత్ర అడుగడుగునా స్పష్టమవుతోంది.
ఈ అనుమానాలకు కారణం రామతీర్థం దేవస్థానానికి చైర్మన్ గా టీడీపీ మాజీ మంత్రి ఉన్నారు. ఈ దేవాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించిన ముందు రోజే విగ్రహం ధ్వంసం జరగడం అంటే ఈ విషయం తెలిసిన వారే చేస్తారని.. ఖచ్చితంగా దీని వెనుక టీడీపీ పాత్ర ఉందనేది పోలీసులు తేల్చారు. విగ్రహం ధ్వంసం అయిన విషయం కూడా ముందుగా ప్రచారం చేసింది టీడీపీ సోషల్ మీడియానే. తలను కోనేరులో పడేసిన ఫొటోలను కూడా టీడీపీ సోషల్ మీడియా బయటపెట్టింది.
ఇంత పక్కాగా వివరాలు బయటకు పొక్కాయంటే ఇదంతా అక్కడి పరిస్థితులు తెలిసినవారే.. స్థానికులేనని అంటున్నారు. గ్రామం మాజీ ఉప సర్పంచ్ , వార్డు మెంబర్ తోపాటు మరికొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రామతీర్థంలో టీడీపీ నేతలను అదుపులోకి తీసుకోగానే చంద్రబాబు కొంప మునుగుతుందని వెంటనే అక్కడికి చేరుకొని రాజకీయం మొదలుపెట్టారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల విగ్రహాలు ధ్వంసమైనా రాని చంద్రబాబు ఇప్పుడు రామతీర్తానికే ఎందుకొచ్చారన్నది ఇప్పడు అనుమానాలకు కారణమవుతోంది.
ఎల్జీ పాలిమర్స్ లో వందలాది మంది ప్రజలు చనిపోయినా ఉత్తరాంధ్ర మోహం చూడని చంద్రబాబు.. ఇప్పుడు టీడీపీ నేతలు దొరికిపోయారనే బండారం బయటపడుతుందనే రామతీర్థం వచ్చారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. దీంతో టీడీపీ కుట్ర రాజకీయం బయటపడినట్టైంది.