
టాలీవుడ్ అగ్రహీరోల్లో మహేష్ బాబు ఒకరు. థమ్స్ అప్ యాడ్ లో ఏకంగా బాలీవుడ్ హీరో రణ్ వీర్ తో కలిసి నటించి ఉత్తరాధికి కూడా పరిచయం ఉన్న నటుడు. తనదైన నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసే మహేష్ బాబు టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి 30 ఏళ్లు గడిచినా ఇంతవరకు బాలీవుడ్ బాట పట్టలేదు. కనీసం ఒక్క సినిమా కూడా చేయలేదు.
అయితే తెలుగు హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తుండడంతో ఇప్పుడు మహేష్ బాబు కూడా తన పంథాను మార్చుకున్నాడు. ప్రభాస్ ఇప్పటికే బాహుబలి, సాహోతో బాలీవుడ్ లో హీరోగా సెటిల్ అయిపోయాడు. హిందీ డైరెక్టర్లతోనే సినిమా చేస్తున్నాడు. ఈ రేసును మహేష్ బాబు ఇంకా మొదలుపెట్టలేదనే చెప్పాలి.
తాజాగా వస్తోన్న వార్తల ఆధారంగా మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. బాలీవుడ్ దర్శకుడు మధు మాటెన వర్మ దర్శకత్వంలో 3డీ రామాయణం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
సుమారు 300 కోట్ల బడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొణే సీతగా నటిస్తుండగా.. రాముడి పాత్రలో హృతిక్ రోషన్ ను అనుకున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అది వర్కవుట్ కాలేదు.
ఇప్పుడు దర్శకుడు రాముడి పాత్ర కోసం అందమైన మహేష్ బాబును సంప్రదించినట్టు సమాచారం. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే చిత్రం యూనిట్ అధికారికంగా ప్రకటించే వరకు వేచిచూడాలి.