దుబ్బాకలో ఓటమి.. జీహెచ్ఎంసీలో ఎదురుదెబ్బను తెలంగాణ రాష్ట్రసమితి అధినేత, సీఎం కేసీఆర్ అంత తేలికగా తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పార్టీలో, ప్రభుత్వంలో మార్పులు అవసరమని భావిస్తున్నట్టు సమాచారం. లేకపోతే వచ్చే 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ పుట్టి మునగడం ఖాయమన్న ఆందోళన గులాబీ దళపతిలో కనిపిస్తోందన్న టాక్ నడుస్తోంది. అందుకే కీలకమైన నిర్ణయాల దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read: హైఅలెర్ట్: బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన 16మందికి కరోనా
ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి మంత్రి కె టి రామారావును తెలంగాణ తదుపరి ముఖ్యమంత్రిగా అభిషేకం చేస్తున్నారనే ఊహాగానాలు తాజాగా చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు మరో ఊహాగానం కూడా ప్రచారం సాగుతోంది.
ఈ తాజా పుకార్ల ప్రకారం, టిఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరోగ్యం సహకరించడం లేదని ప్రచారం సాగుతోంది. చురుకుగా పరిపాలనా కార్యకలాపాల్లో కనిపించకపోవడానికి ఇది కారణమని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి తన కుమారుడు కెటిఆర్ ను ముఖ్యమంత్రిగా చేయడానికి కెసిఆర్ పదవీవిరమణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని టాక్ నడుస్తోంది.
ఈ ఊహాగానాలకు విశ్వసనీయతను ఇస్తూ, టిఆర్‌ఎస్ సీనియర్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ గురువారం సంచలన కామెంట్స్ చేశారు. మార్చి ముగిసేలోపు కెటిఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని బాంబు పేల్చారు. ఆశ్చర్యకరంగా ఆయన ప్రకటనపై పార్టీ నాయకత్వం నుంచి ఎటువంటి తిరస్కరణ రాకపోవడం విశేషం.
Also Read: గ్రేటర్లో టీఆర్ఎస్ కు షాకిచ్చిన బీజేపీ..!
అదే జరిగితే, కెటిఆర్ తన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని వదులుకుంటాడు. అతని స్థానంలో హరీష్ రావు నియామకం అయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో పార్టీని ముందు నుండి నడిపించే బాధ్యతను హరీష్ కు అప్పగించే అవకాశం ఉంది. వీలైతే, కెసిఆర్ మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించి మరొక సీనియర్ మంత్రి ఈటల రాజేందర్ కు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.
స్పష్టంగా, కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేస్తే హరీష్ రావుకు అన్యాయం జరిగిందన్న భావన రాకుండా ఆయనకు పార్టీని కేసీఆర్ అప్పగించి ఆయన అనుచరులు, ఫ్యాన్స్ ను అసంతృప్తిని కూల్ చేయబోతున్నాడన్నమాట.. తద్వారా పార్టీలో తిరుగుబాటును నిరోధించడం కేసీఆర్ ప్లాన్ గా చెబుతున్నారు.
పార్టీలో అధికార సమతుల్యతను చేయడానికి వీలుగా కెసిఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు కూడా పార్టీలో కొంత కీలక బాధ్యత ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. మరి ఇవన్నీ జరుగుతాయా? లేదా? అన్నది మార్చిలో జరిగే పరిణామాల వరకు వేచిచూడక తప్పదు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్