వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ను నిలబెట్టిన నేత. ఆయన సారథ్యంలోనే ఎంతో మంది కాంగ్రెస్ నేతలు వెలుగులోకి వచ్చారు. ఎంతో మంది కొత్త వారిని తీసుకొచ్చి లైఫ్ ఇచ్చారు వైఎస్ఆర్. కాంగ్రెస్ లో ముక్కు మొఖం తెలియని వారు కూడా మంత్రులయ్యారు. కీలక శాఖలయ్యారు. ఇప్పుడు తెలంగాణ, ఏపీలో కాంగ్రెస్ పార్టీ దీనస్థితికి చేరినా ఆ పార్టీలో ఒకప్పుడు వెలుగు వెలిగిన నేతలు ఇప్పుడు పార్టీలు మారినా కూడా వైఎస్ఆర్ ను మరిచిపోరు.
తాజాగా వైఎస్ఆర్ గురించి జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కూడా చర్చ జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దివంగత వైఎస్ఆర్ పై నోరుపారేసుకున్నారు. ఆయన గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన గద్వాల జేజమ్మ.. బీజేపీ నాయకురాలు డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ అంటే ప్రాణమిచ్చే డీకే అరుణపై ఆయనపై సొంత పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలను జీర్ణించుకోలేపోయానని వెల్లడించారు. ముమ్మాటికి బీజేపీ నేతలు చేసింది తప్పేనని అన్నారు.
తాను పార్టీలో కూడా వైఎస్ఆర్ పై చేసిన కామెంట్లపై నేతలను నిలదీశానని..అందుకే వారు సారీ చెప్పారని.. వైఎస్ఆర్ పై వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని డీకే అరుణ చెప్పుకొచ్చారు. తాను బీజేపీలో ఉన్నా నాటి కాంగ్రెస్ ను.. తనకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ఆర్ ను మరువలేనని.. ఆయన ఎంతో మందికి లైఫ్ ఇచ్చాడని అరుణ చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ లాంటి మహానేత మరొకరు లేరని.. బీజేపీ నేతలు ఏదో సందర్భానుసారం వైఎస్ఆర్ పై వ్యాఖ్యానించారని.. ఆయనను అవమానించే ఉద్దేశం బీజేపీ నేతలకు లేదన్నారు. అందుకే వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని వివరించారు.
వైఎస్ఆర్ పై బీజేపీ నేతల వ్యాఖ్యల నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయన అభిమానులు, ఆంధ్రా సెటిలర్లు, వైసీపీ ఫ్యాన్స్ అంతా టీఆర్ఎస్ కు ఓటు వేశారన్న ప్రశ్నకు డీకే అరుణ స్పందించారు. కొంతవరకు కావచ్చని.. కానీ టీఆర్ఎస్ సర్కార్ బెదిరింపుల వల్లే ఆంధ్రా ఓటర్లు జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ కు పట్టం కట్టారని వివరించారు.
మొత్తం గద్వాల అరుణక్క బీజేపీలో చేరినా వైఎస్ఆర్ నామస్మరణను మాత్రం విడవకపోవడం బీజేపీ అభిమానులను ఒకింత ఇబ్బంది పెట్టగా.. వైసీపీ అభిమానులను మాత్రం ఖుషీ చేసింది.