కక్కలేం.. అలాగని మింగలేం.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో పొత్తు కథ బీజేపీకి అలానే ఉందట.. మింగమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా ఏపీలో పొత్తులో ఉన్న పవన్ తో తెలంగాణలో అవకాశాలు దెబ్బతినే పరిస్థితి రావడంతో కమళనాథులకు ఏం చేయాలో పాలుపోవడం లేదట..
Also Read: బాబు బాటలో జగన్.. పుట్టిమునగడం ఖాయమా?
అడకత్తెరలో పోకచెక్కల ఉంది బీజేపీ నాయకుల పరిస్థితి. జీహెచ్ఎంసి ఎన్నికల్లో సత్తా చాటాలని కృతనిశ్చయంతో ఉన్న బీజేపీకి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తలపోటుగా తయారైందన్న వాదన వినిపిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలలో సెటిలర్ల ప్రాబల్యం ఉన్న చోట్ల పవన్ కళ్యాణ్ మద్దతు అవసరం అవుతుంది. అయితే పవన్ సైతం జీహెచ్ఎంసీ బరిలో నిలవడానికి రెడీ అవుతున్నారు. ‘దాని కోసం ఆయనకు 10-20 సీట్లకు మించి ఇవ్వలేం.. అన్ని తక్కువ సీట్లకు ఆయన ఒప్పుకుంటాడా అనేది అనుమానం,” అని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని అవసరాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ ని నొప్పించే పరిస్థితి కూడా బీజేపీకి ఇక్కడ లేకపోవడం విశేషం.
అయితే జీహెచ్ఎంసీ ఎన్నికలు బీజేపీకి ఇప్పుడు అత్యంత కీలకంగా మారాయి. అసలు తెలంగాణలో నిర్మాణమే లేని జనసేనకు ఎక్కువ సీట్లు ఇస్తే పరిస్థితి ఇబ్బందికరమే అంటున్నారు. దీంతో బీజేపీ నాయకులు అవస్థలు పడుతున్నారు.
జీహెచ్‌ఎంసీలో పోటీ చేస్తానంటూ గతంలోనూ చాలాసార్లు టీజర్లు విసిరిన జనసేన, ఇప్పుడు ఏకంగా ట్రైలర్ రిలీజ్ చేసింది. బల్దియాపోరులో తలపడబోతున్నట్టు అధికారికంగా జనసేన ప్రకటించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడైన బండి సంజయ్ ఇటీవల పవన్‌తో సమావేశం కూడా అయ్యారు. గ్రేటర్ ఎన్నికల కోసమే వీరు కలిశారన్న మాటలు అప్పుడు వినిపించాయి. ఇప్పడు కూడా జనసేన పోటీ చేస్తుందని చెప్పారు గానీ, బీజేపీతో పొత్తు వుంటుందా, వుండదా మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
Also Read: రూ.310 కోట్ల ఖర్చా.. ధనిక రాష్ట్రమా మాజాకా?
తెలంగాణలో పవన్ కల్యాణ్‌కు ఫాలోయింగ్ వుంది. ఇటు సీమాంధ్ర, అటు తెలంగాణ అభిమానుల ఓట్లపైనే జనసేన ఆశలు. అంతేకాదు, కాపువర్గం ఓట్లు కూడా చెప్పుకోగదగ్గ సంఖ్యలో ఉన్నాయి. ఇలా సీమాంధ్ర ఓట్లు, అటు కాపుసామాజికవర్గం లెక్కలు, బల్దియా బరిలో దిగడానికి జనసేననను ప్రేరేపిస్తుండొచ్చు.
ఒకవేళ బీజేపీతో పొత్తువున్నా, లేకపోయినా, ఆయనే గనుక ప్రచారానికి వస్తే, గ్రేటర్ పోరులో అలజడే. కేసీఆర్‌పై నేరుగా విమర్శలు చెయ్యాల్సి వస్తే, గులాబీదళం ఊరుకునే రకం కాదు. గతంలో తెలంగాణపై పవన్ చేసిన కామెంట్ల క్యాసెట్లను బయటకు తీస్తుంది. తెలంగాణను వ్యతిరేకించిన పవన్‌కు, తెలంగాణలో పనేంటని ప్రశ్నించొచ్చు. జనసేనతో సీమాంధ్ర ఓట్లను చీల్చడమే కాషాయ వ్యూహమా? జనసేనతో నేరుగా పొత్తు మొదటికే మోసమని, కాషాయంలోని ఓ వర్గం అంటోంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
సీమాంధ్ర ఓట్లు అధికంగా వుండే డివిజన్లలో, జనసేన పోటీ చేస్తే, అక్కడ బీజేపీ తరపున డమ్మీ అభ్యర్థులను పెట్టి, ఇన్‌డైరెక్ట్ సపోర్ట్ చెయ్యొచ్చు. గత బల్దియా ఎన్నికల్లో టీఆర్ఎస్‌కే సీమాంధ్ర జనం ఓటేసిన నేపథ్యంలో, ఆ ఓట్లను చీల్చి, అధికార పార్టీని దెబ్బతియ్యాలన్నది కాషాయ వ్యూహంలో భాగం కావొచ్చని కొందరంటున్నారు.