Gautham Vasudev : ప్రముఖ చిత్రనిర్మాత, నటుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ప్రేమకథలను తీర్చిదిద్దడంతో ఆయన ప్రత్యేకత వేరుగా ఉంటుంది. కొన్నేళ్లుగా అతను భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. అయితే, ఆయన స్టార్ డైరెక్టర్ కావడానికి చాలా సవాళ్లను ఎదర్కొన్నాడు. ఇటీవల మదన్ గౌరీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ తన కెరీర్లో ఎదుర్కొన్న సవాళ్ల గురించి చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ధ్రువ నక్షత్రం: చాప్టర్ వన్ – యుద్ధ కాండం చిత్ర విషయంలో ఎదురైన ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు.. ఈ సినిమాలో విక్రమ్ హీరోగా నటిస్తున్నారు. మరియు సమిష్టి తారాగణం నటించిన ఈ చిత్రం ఆర్థిక సమస్యలు, ఇతర ఎదురుదెబ్బల కారణంగా 2017 నుండి నిర్మాణంలో చిక్కుకుంది. అతను అవిశ్రాంతంగా ప్రయత్నించినప్పటికీ చిత్రం విడుదల కాలేదు ఇండస్ట్రీ నుండి మద్దతు లేకపోవడంతో గౌతమ్ నిరుత్సాహపడ్డాడు.
అవసరమైనప్పుడు ఇండస్ట్రీలో ఎవరూ సహకరించరని గౌతమ్ మేనన్ (Gautham Vasudev Menon) తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ విషయం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నందుకు ఎంతో బాధగా ఉంది. ఇండస్ట్రీలో నాకు సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది మాత్రమే నిజం. నేను తీసిన ‘ధ్రువ నక్షత్రం’ రిలీజ్ టైంలో ఎదురైన సమస్యల గురించి ఎవరూ స్పందించలేదు. కనీసం ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు కూడా ప్రయత్నంచలేదు. ఇండస్ట్రీ ఆ చిత్రాన్ని అసలు పట్టించుకోకుండా వదిలేసింది. ఆ సినిమా గురించి కూడా ఎవరికీ తెలియదు. ధనుష్, లింగుస్వామి మాత్రమే సినిమా గురించి అడిగారు. విడుదల చేయడానికి ప్రయత్నించారు. కొన్ని స్టూడియోల వారికి ఈ సినిమాను చూపించాను. కానీ, కొన్ని సమస్యలు ఉన్నందున ఎవరూ దాన్ని తీసుకోలేకపోయారు. రిలీజ్ చేయడానికి ముందుకురాలేదు. ప్రేక్షకులు ఇంకా నా సినిమాలను చూడాలని కోరుకుంటున్నారు.. కాబట్టే ఇంకా నేను బతికి ఉన్నాను’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
హీరో విక్రమ్ (Vikram) నటించి.. గౌతమ్ వాసుదేవ్ మేనన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ధ్రువ నక్షత్రం’ (Dhruva Natchathiram). ఏడు సంవత్సరాల క్రితమే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆర్థిక సమస్యల కారణంగా రిలీజ్ కాలేదు. దీనిపై ఇప్పటికే పలుమార్లు గౌతమ్ వాసుదేవ్ మేనన్ ఇండస్ట్రీపై అసహనం వ్యక్తం చేశారు. ఇది వాయిదాల మీద వాయిదాలు పడడం ఎంతో బాధగా ఉందని అన్నారు. ‘ఇది చాలా హృదయ విదారకం. ఆ సినిమా వాయిదా విషయంలో ఎన్నో రోజులుగా నాకు మనశ్శాంతి లేదు. నా కుటుంబం అంతా తీవ్రంగా ఆందోళన చెందుతోంది. నా భార్య నెల రోజులుగా ఈ విషయం గురించే ఆలోచిస్తుంది. నాకు ఎటైనా వెళ్లిపోవాలనిపిస్తోంది. కానీ, నన్ను నమ్మి ఇన్వెస్ట్ చేసిన వారికి సమాధానం చెప్పాలని ఉంటున్నా’ అని ఓ సందర్భంలో గౌతమ్ మేనన్ తెలిపారు.