Game Changer: సినిమా విడుదలకు ముందే కథ తెలిసిపోతే పెద్దగా థ్రిల్ ఉండదు. ప్రేక్షకుడు సినిమా మీద ఒకింత ఆసక్తి కోల్పోతాడు. అందుకే దర్శక నిర్మాతలు ఈ విషయంలో జాగ్రత్త తీసుకుంటారు. ట్రైలర్ కట్ కూడా సస్పెన్సు అంశాలతో నింపి ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తారు. కాగా రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ స్టోరీ లైన్ బయటకు వచ్చేసింది. అసలు కథ ఏమిటో లీకైంది. దర్శకుడు శంకర్ పొలిటికల్ థ్రిల్లర్ గా గేమ్ ఛేంజర్ మూవీ తెరకెక్కిస్తున్నాడు. దాదాపు రెండేళ్లుగా ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది.
గేమ్ ఛేంజర్ ఇప్పటికే విడుదల కావాల్సింది. దర్శకుడు శంకర్ భారతీయుడు 2 ప్రాజెక్ట్ బాధ్యతలు తిరిగి తీసుకున్నారు. గతంలో భారతీయుడు 2 వివాదాలతో ఆగిపోయింది. దాంతో శంకర్ గేమ్ ఛేంజర్ చిత్రీకరణ స్టార్ట్ చేశాడు. విక్రమ్ బ్లాక్ బస్టర్ కావడంతో భారతీయుడు 2 నిర్మాతలు శంకర్ తో కాంప్రమైజ్ అయ్యారు. ఈ క్రమంలో శంకర్ ఆ చిత్రాన్ని పూర్తి చేయాల్సి వ్ వచ్చింది. గేమ్ ఛేంజర్ చిత్రీకరణ నెమ్మదించింది. భారతీయుడు 2 షూట్ పూర్తి కాగా.. శంకర్ గేమ్ ఛేంజర్ చిత్రీకరణ పై దృష్టి పెట్టాడు.
ఇటీవల వైజాగ్ లో ఒక షెడ్యూల్ పూర్తి చేశారు. కాగా గేమ్ ఛేంజర్ ఓటీటీ హక్కులు ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. కాగా ఈ సంస్థ గేమ్ ఛేంజర్ స్టోరీ లైన్ వెల్లడించింది. పాలనలో మార్పు తెచ్చేందుకు ఒక నిజాయితీ పరుడైన ఐఏఎస్ అధికారి రాజకీయాల్లోని అవినీతి పై ఎలా పోరాడాడు అనేదే కథ… అని తెలియజేశారు. దీంతో గేమ్ ఛేంజర్ మూవీలో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారి పాత్ర చేస్తున్నాడన్న క్లారిటీ వచ్చేసింది. అమెజాన్ ప్రైజ్ స్టోరీ లైన్ బహిర్గతం చేయడం పై చరణ్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కాగా గేమ్ ఛేంజర్ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ పొలిటికల్ లీడర్ గా కనిపిస్తాడని సమాచారం. ఆ పాత్రకు జంటగా అంజలి నటిస్తుంది. దిల్ రాజు గేమ్ ఛేంజర్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. సునీల్, శ్రీకాంత్ కీలక రోల్స్ చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ మూవీపై అంచనాలు ఉన్నాయి.