AP Assembly Elections 2024
AP Assembly Elections 2024: సెఫాలజిస్ట్ పార్ధా దాస్.. ఎన్నికల సమయంలో తరచూ వినిపిస్తుంది ఈ పేరు. చాణక్య సంస్థ పేరిట సర్వే చేపడుతుంటారు. ప్రజాభిప్రాయాన్ని ఒడిసిపడుతుంటారు. ఓటర్ల అభిప్రాయాన్ని క్రోడీకరించి నివేదికలు రూపొందిస్తుంటారు. తాజాగా ఆయన ఏపీలో ఓటర్ల మూడ్ ను తెలుసుకునే ప్రయత్నం చేశారు. రెండు జిల్లాల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. ఆ ఫలితాలను ప్రకటించారు.
విశాఖపట్నం జిల్లాలో అధికార వైసిపి దారుణంగా దెబ్బతింటుందని అంచనా వేశారు. 15 అసెంబ్లీ స్థానాలకు గాను.. తొమ్మిది నుంచి పది స్థానాలు కూటమి గెలుచుకుంటుందని తేల్చి చెప్పారు. వైసిపి ఐదు నుంచి ఆరు సీట్లకు పరిమితం కానుందని తేల్చేశారు. గత ఎన్నికల్లో విశాఖ జిల్లాలో 15 స్థానాలకు గాను.. 11చోట్ల వైసిపి గెలిచింది. ఈసారి మాత్రం కూటమి ఆధిక్యత దిశగా ముందుకెళ్తోంది. తాజా సర్వేలో ఇదే తేలింది. జగన్ సర్కార్ విశాఖ రాజధాని ప్రకటించిన నేపథ్యంలో.. అక్కడ వర్క్ అవుట్ కాదని ఈ సర్వే తేల్చి చెప్పడం విశేషం.
నెల్లూరులో వైసిపి ఆధిక్యత సాధిస్తుందని పార్దా దాస్ సర్వే తేల్చి చెప్పింది. మొత్తం పది అసెంబ్లీ స్థానాలకు గాను వైసీపీ 6 నుంచి ఏడు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. కూటమి మూడు నుంచి నాలుగు సీట్లు దక్కించుకోనుందని తేలింది. అయితే ఇక్కడ కూడా వైసిపి గ్రాఫ్ గణనీయంగా పడిపోయిందని తేలింది. 2014, 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసిపి ఏకపక్ష విజయాన్ని దక్కించుకుంది. గత ఎన్నికల్లో స్వీప్ చేసినంత పని చేసింది. అయితే ఈసారి మూడు నుంచి నాలుగు స్థానాలు కోల్పోయే అవకాశం ఉంది. ఈ జిల్లా నుంచి ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు. కీలక నేతగా ఉన్న వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైతం టిడిపిలో చేరిపోయారు. ఆయనే ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. దీంతో ఒక్కసారిగా నెల్లూరు రాజకీయాలు మారిపోయాయి. క్రమేపి ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలం పుంజుకున్నట్లు తాజా సర్వే తేల్చింది. మొత్తానికైతే పార్ధా దాస్ సర్వే వాస్తవానికి దగ్గరగా ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రధానంగా వైసీపీకి ప్రమాద ఘంటికలు తప్పవని ఈ సర్వే తేల్చడం విశేషం.