Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. #RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ శంకర్ లాంటి డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు అనే వార్త వచ్చినప్పుడే అభిమానులు సంబరాలు చేసుకున్నారు. షూటింగ్ పూర్తి చేసుకొని ఎప్పుడో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా మధ్యలో ఏర్పడిన కొన్ని పరిస్థితుల కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా , ఈ ఏడాది డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన మొదటి పాట ‘జరగండి..జరగండి’ కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ చూసినా ఈ పాటనే వినిపిస్తుంది.
వినాయక చవితి రోజు ఈ సినిమా నుండి రెండవ పాట అతి త్వరలోనే విడుదల చేయబోతున్నాం అంటూ ఒక ప్రకటన చేసారు. రెండు రోజుల క్రితమే ఈ పాటకు సంబంధించిన ప్రోమోని విడుదల చేయగా, నేడు పూర్తి స్థాయి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేసారు. ‘రా మచ్చ మచ్చ’ అంటూ సాగే ఈ పాట సినిమాలో రామ్ చరణ్ పరిచయ పాటగా ఉంటుందట. సాధారణంగా మనకి ఏ పాట అయినా విన్న మొదటిసారి నచ్చేయదు, కనీసం రెండు మూడు సార్లు అయినా వినాల్సిందే. కానీ ఈ పాట ని విన్న మొదటిసారే ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది. పిక్చరైజేషన్ లో శంకర్ మార్క్ కనిపించింది, ఇక రామ్ చరణ్ వేసిన స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ పాట కోసం వివిధ రాష్ట్రాల నుండి అనేక సాంస్కృతిక నృత్య కళాకారులను తీసుకొచ్చారట.
గణేష్ ఆచార్య ఈ పాటకు కొరియోగ్రఫీ చేసాడు. అలాగే ఈ పాటలో రామ్ చరణ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ లాగా ఎర్ర తువ్వా తలకు చుట్టుకొని, మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమా విడుదల రోజు హంగామా చేస్తున్నట్టుగా చూపించారు. ఒక్కసారిగా పాట మధ్యలో చిరంజీవి కటౌట్ కి పూలమాలలు వేసిన ఫోటో చూడగానే అభిమానులు సర్ప్రైజ్ కి గురి అయ్యారు. కేవలం కంటెంట్ నేపథ్యం లోనే కాదు, ఈ చిత్రాన్ని ఫ్యాన్స్ అభిరుచికి తగ్గట్టుగా కూడా తెరకెక్కించారు అనేది ఈ లిరికల్ వీడియో ని చూసిన తర్వాత ఆడియన్స్ కి ఒక క్లారిటీ వచ్చింది. ఈ పాట మొదటి పాట కంటే పెద్ద హిట్ అయ్యేలాగా అనిపిస్తుంది. డ్యాన్స్ స్టెప్పులు కూడా చూసేందుకు చాలా సింపుల్ గా, గ్రేస్ గా ఉండడంతో ఇంస్టాగ్రామ్ లో రీల్స్ దంచికొడుతారని అంచనా వేస్తున్నారు అభిమానులు. మరి ఈ పాట ఏ రేంజ్ కి వెళ్తుందో చూడాలి. ఇది ఇలా ఉండగా మేకర్స్ దసరా కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేయబోతున్నారట.