Game Changer Collections : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం ఫలితం ఎలా వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, అందరికీ తెలిసిందే. మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా, సోషల్ మీడియా నెగటివిటీ కి మరింత దారుణంగా బలి అయ్యింది. కొంతమంది పనిగట్టుకొని ఈ సినిమాపై నెగటివ్ ప్రచారం చేయడమే కాకుండా, HD ప్రింట్ ని ఆన్లైన్ లో అప్లోడ్ చేయడం సంచలనం గా మారింది. నెగటివ్ టాక్ ఎలాగో వచ్చింది, ఇక థియేటర్ కి వెళ్లి ఈ సినిమాని ఏమి చూస్తాములే అని, అనేక మంది ప్రేక్షకులు డౌన్లోడ్ చేసుకొని ఈ సినిమాని చూసారు. ఈ ప్రభావం చాలా గట్టిగానే పడిందని నిర్మాతలు అంటున్నారు. లీక్ చేసిన వారిపై పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. అయితే ఇంత నెగటివిటీ మధ్యలో కూడా ఈ చిత్రం పర్వాలేదు అనే రేంజ్ లో వసూళ్లను రాబడుతుంది.
ఆ వసూళ్లు బ్రేక్ ఈవెన్ కి ఏ మాత్రం సరిపోనివి కానప్పటికీ, థియేటర్స్ కి మాత్రం ఫీడింగ్ ఇచ్చే రేంజ్ లో రన్ ఉంది. విడుదలై పది రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లను రాబట్టింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 204 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. షేర్ వసూళ్లు దాదాపుగా 110 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఆదివారం ఈ సినిమాకి కలిసొస్తుందని బయ్యర్స్ ఆశించారు కానీ, ఆరోజున కేవలం కోటి రూపాయిల షేర్ మాత్రమే తెలుగు రాష్ట్రాల నుండి రాబట్టిందట. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గ్రాస్ పదవ రోజు 3 కోట్ల రూపాయిల వరకు వచ్చిందని అంటున్నారు. హిందీ వెర్షన్ వసూళ్లు పర్వాలేదు అనే రేంజ్ లో వచ్చాయి.
తమిళ వెర్షన్ లో శంకర్ బ్రాండ్ ఇమేజ్ కలిసొచ్చి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ అక్కడ భారీ నష్టాలను మిగిలించింది ఈ చిత్రం. అక్కడి ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 16 కోట్ల రూపాయలకు జరిగింది. ఆదిత్య రామ్ అనే వ్యక్తి ఈ రైట్స్ ని కొనుగోలు చేసాడు. గతంలో ఈయన ప్రభాస్ తో ‘ఏక్ నిరంజన్’ అనే సినిమాని తీసి భారీ నష్టాలను మూటగట్టుకున్నాడు. ఆ తర్వాత సినీ రంగానికి దూరంగా జరిగి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ కాలం గడిపాడు. మళ్ళీ గేమ్ చేంజర్ చిత్రం తో రీ ఎంట్రీ ఇచ్చిన ఆయనకి మళ్ళీ చేదు అనుభవమే ఎదురైంది. ఇప్పటి వరకు ఈ సినిమాకి తమిళనాడు నుండి 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 11 కోట్లు రావాలి, అది అసాధ్యం అని అంటున్నారు ట్రేడ్ పండితులు.