
Tollywood Drugs Case : తెలుగు సినీ పరిశ్రమలో డ్రగ్స్ కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. 2017లో వెలుగు చూసిన ఈ వ్యవహారానికి సంబంధించి ఎక్సైజ్ శాఖ చాలా మంది సినీ ప్రముఖులను విచారించింది. ఇప్పుడు రెండో విడతగా ఆగస్టు 30 నుంచి పూరీ జగన్నాథ్, ఛార్మి, రవితేజ, తరుణ్, రానా, నవదీప్ ముమైత్ ఖాన్ వంటి వారిని గంటల తరబడి ఈడీ (enforcement directorate) విచారించింది. ఈ విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే.. ఇప్పుడు వీరిలో 12 మంది ఎక్సైజ్ శాఖ క్లీన్ చిట్ ఇవ్వడం గమనార్హం.
ఈ మేరకు కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొన్నట్టు సమాచారం. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు ఆధారంగా 16 మంది సినీ ప్రముఖులు డ్రగ్స్ తీసుకోలేదని కోర్టులో వేసిన ఛార్జ్ షీట్‌లోనూ పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించేందుకు అప్పట్లోనే వీరి నుంచి బ్లడ్ శాంపిల్స్, గోళ్లు, వెంట్రుకలు వంటివి సేకరించారు. రిపోర్టు కూడా గతేడాది డిసెంబరులోనే వచ్చిందని వార్తలు వచ్చాయి. మరి, ఇంత కాలం తర్వాత ఆ రిపోర్టును బయట పెట్టడమేంటీ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే.. డ్రగ్స్ సరఫరా చేసినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న కెల్విన్ ను మాత్రం ఎక్సైజ్ శాఖ నిందితుడిగానే పేర్కొంది. 16 మంది సినీ సెలబ్రిటీలకు మాత్రం క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే.. ప్రస్తుం ఈడీ విచారణ కొనసాగుతున్న సమయంలోనే ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక బయటపెట్టడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం రాజకీయండా కూడా హాట్ టాపిక్ అయ్యింది.
టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ – తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది. అవసరమైతే తాను వెంట్రుకలు, గోళ్లు ఇచ్చేందుకు కూడా సిద్ధమని మంత్రి ప్రకటించారు. ఈ విధంగా తెలుగు సినీ పరిశ్రమ డ్రగ్స్ వ్యవహారం.. రాజకీయంగానూ దుమారం రేపుతోంది. అయితే.. ఎక్సైజ్ శాఖ తన వద్ద ఎలాంటి ఆధారాలూ లేనప్పుడు ఈ స్థాయిలో హడావిడి ఎందుకు చేసినట్టు? అనే చర్చ జరుగుతోంది. మొత్తానికి ఈ మలుపుతో టాలీవుడ్ డ్రగ్స్ కేసు సుఖాంతమైనట్టే అని అంటున్నారు.