Prakash Raj: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానళ్లు పోటీలో హోరాహోరీగా పోరాడారు. చివరకు మంచు విష్ణు విజయం సాధించారు. దీంతో ప్రకాశ్ రాజ్ మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్య పరిచారు. మా ఎన్నికల్లో గెలుపోటములు సహజమే అయినా ప్రకాశ్ రాజ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎందులోనైనా పోటీ ఉంటుంది. కానీ విజయం వరించనంత మాత్రాన రాజీనామా చేయడంపై అందరిలో ఆశ్చర్యం కలుగుతోంది.

మా ఎన్నికల్లో మునుపెన్నడు లేని విధంగా పోటీ నెలకొంది. సాధారణ ఎన్నికలను తలపించేలా కొనసాగాయంటే ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్థమవుతోంది. రెండు గ్రూపుల మధ్య పోటీలో ఉన్న సభ్యులు తమ విజయం కోసం అహర్నిశలు శ్రమించారు. దీంతో ఈ ఎన్నికల్లో కులం కూడా ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ ఓటమి పాలవడం మామూలే.
ఇందులో పలు రాజకీయ పార్టీలు కూడా పాల్గొన్నట్లు సమాచారం. వైసీపీ, టీడీపీ, బీజేపీ వంటి పార్టీల నేతలు కూడా ఇందులో తమ ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. కానీ ప్రకాశ్ రాజ్ ఓడినా నైతికంగా ఆయనే గెలిచారని పలువురు పేర్కొనడం గమనార్హం. కానీ ఆయన రాజీనామా ఎందుకు చేశారన్నదే ప్రశ్న. ఓటమి చెందినంత మాత్రాన యుద్ధం నుంచి విరమించుకోవడం సముచితం కాదని పలువురు పేర్కొంటున్నారు.
ప్రకాశ్ రాజ్ ఓటమిపై మాజీ ఎంపీ హర్ష కుమార్ సామాజిక మాధ్యమం వేదికగా తన మనసులోని భావాలు పంచుకున్నారు. ప్రకాశ్ రాజ్ కు ఓదార్పు ఇస్తున్నారు. మా ఎన్నికల్లో అపజయం కలిగినంత మాత్రాన ఏదో జరిగిపోయినట్లు కుంగిపోకూడదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ప్రకాశ్ రాజ్ కు ఆయన ధైర్యం నింపుతున్నారు.