కరోనా వరుసగా రెండో సమ్మర్ ను కూడా మింగేసింది. మొదటిసారి లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతపడితే.. సెకండ్ వేవ్ లో భయంతోనే మూసేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో.. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న చిన్న సినిమాలు.. వెయిట్ చేస్తే లాభం లేదనుకొని ఓటీటీవైపు అడుగులు వేస్తున్నాయి. ప్రస్తుతం రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయి.
ఇందులో ఒకటి ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ చిత్రం. దర్శకుడు క్రిష్ ‘కొండపొలం’ అనే నవల ఆధారంగా వైష్ణవ్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఓ చిత్రాన్ని రూపొందించారు. వికారాబాద్ అటవీ ప్రాంతంలో.. కేవలం 40 రోజుల్లోనే ఈ సినిమా కంప్లీట్ చేశాడు.
ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని.. ఉప్పెన హోరులోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాడు. వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేశాడు. కానీ.. అంతకన్నా వేగంగా సెకండ్ వేవ్ దూసుకొచ్చింది. దీంతో.. ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చూస్తున్నాడట. ఆలస్యం చేస్తే.. వైష్ణవ్ క్రేజ్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి.. ఈ లోగానే సినిమాను వదిలేయాలని చూస్తున్నారట. ‘ఆహా’ డిస్కషన్స్ నడుస్తున్నట్టు సమాచారం.
ఇక, మరో మూవీ ‘ఏక్ మినీకథ’. యువి క్రియేషన్స్ రూపొందించిన చాలా చిన్న బడ్జెట్ మూవీ ఇది. క్లాస్ అడల్ట్ కంటెంట్ తో ఈ మూవీ తెరకెక్కింది. సంతోష్ శోభన్ హీరోగా.. మేర్లపాక మురళి సూపర్ విజన్ లో రూపొందించిన చిత్రమిది. బోల్డ్ కంటెంట్ తో రూపొందిన సినిమా కాబట్టి.. ఓటీటీనే బెటర్ అని భావిస్తున్నారట. మంచి రేటు వస్తే.. వదులుదామని చూస్తున్నారట మేకర్స్.
ప్రేక్షకులు చాలా రోజులుగా కరువు మీదున్నారు. ప్రస్తుతం వకీల్ సాబ్ ఓటీటీలో సందడి చేస్తోంది. దీని జోరు తగ్గిన తర్వాత ఈ రెండు లైన్లోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. మరి, ఎవరు కొంటారు? ఎంతకు కొంటారు? అనేది చూడాలి.