dulquer salmaan: మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడిగా మారిన మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. ఈ క్రమంలోనే ఆయన నటించిన ఎన్నో సినిమాలు తెలుగులోనూ విడుదలవుతూ వచ్చాయి. ప్రేక్షకులు కూడా అంతే ప్రేమతో ఆదరిస్తూ వచ్చారు. ఇలా మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు దుల్కర్. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈయన హీరోగా నటించిన సినిమా కురుప్. నవంబరు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బుధవారం సినిమా ట్రైలర్ విడుదల చేసింది చిత్రబృందం. కేరళకు చెందిన ఒకప్పటి బడా క్రిమినల్ సుకుమార కురుప్ జివిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఆ క్రిమినల్‌ను పట్టుకునేందుకు పోలీసులు చేసే ప్రయత్నాలు, వాటి నుంచి తప్పించుకునేందుకు కురుప్ వేసే ఎత్తులు ట్రైలర్ చూసినప్పుడు ఉత్కంఠంగా అనిపించింది. దీంతో అభిమానుల్లో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా నేపథ్య సంగీతం చాలా కీలకంగా నిలిచింది.
మరి గోపీకృష్ణన్.. కురుప్‌గా ఎందుకు మారాడు? పరిస్థితుల ప్రభావం వల్లా? అలవు పోలీసులు ఆయన్ను పట్టుకున్నారా? సుకుమార కురుప్ జీవితం ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడక తప్పదు మరి. శ్రీనాథ్ రాజేంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శోభిత కథానాయిక. ఇంద్రజిత్ సుకుమారన్, సన్నీ వేన్ కీలక పాత్రలు పోషించారు. సుషిన్ శ్యామ్ సంగీతం అందించగా.. నిమిష్ రవి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. మలయాళం, తెలుగుతో పాటు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లోనూ ఈ సినిమా విడుదల కానుంది.