Upcoming Movies: సాధారణంగా సినిమాలను శుక్రవారం రోజున విడుదల చేస్తుంటారన్న విషయాన్ని మీరెప్పుడైనా గుర్తించారా? అంతేందుకు ఇటీవల బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’, విక్కీ కౌశల్ నటించిన ‘షైమ్ బహదూర్’ వంటి సినిమాలు సైతం శుక్రవారమే థియేటర్లలోకి వచ్చాయి. ఇవే కాదు ఇలా శుక్రవారం రోజునే రిలీజ్ అయిన మూవీస్ చాలానే ఉన్నాయి. అయితే ఎందుకు అలా? శుక్రవారం మాత్రమే ఎందుకు థియేటర్లలో సినిమాలను విడుదల చేస్తున్నారు అనుకుంటున్నారా? దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
దాదాపు భారతీయ చిత్ర పరిశ్రమలో సినిమాలన్నీ శుక్రవారమే విడుదల అవుతాయి. దీని వెనుక పెద్ద కారణమే ఉందని తెలుస్తోంది. మాములుగా చాలా మంది ఉద్యోగులకు శుక్రవారంతో వర్కింగ్ డేస్ ముగుస్తాయి. దీంతో శని, ఆదివారాలు సెలవులుంటాయి. వరుస సెలవులతో చాలా వరకు స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఆ విధంగా మూవీ కలెక్షన్ పెరుగుతుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అయితే మన దేశంలో శుక్రవారం మాత్రమే థియేటర్లలో విడుదల చేసే ఆనవాయితీ మొదటి నుంచి లేదని తెలుస్తోంది. 1960 వ సంవత్సరానికి ముందు సినిమా రిలీజ్ కోసం ప్రత్యేకమైన రోజని ఎంపిక చేసే వారు కాదు.. అయితే అదే సంవత్సరంలో ఆగస్ట్ 5 శుక్రవారం నాడు ‘మొఘల్ ఎ ఆజం’ అనే చిత్రం విడుదల కావడంతో పాటు ప్రేక్షకుల నుంచి విశేషంగా ఆదరణ పొందింది. దీంతో అప్పటి నుంచి సినిమాలను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు శుక్రవారాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారట. అదే ఆనవాయితీగా ఇప్పటివరకు కొనసాగుతూ వస్తుంది. అలా అని ప్రతి సినిమా శుక్రవారమే రిలీజ్ కావడం లేదు. కొంతమంది వేరే వారాల్లోనూ తమ చిత్రాలను విడుదల చేసి విజయాన్ని సొంతం చేసుకున్నారన్న విషయం కూడా తెలిసిందే. కానీ ఇండస్ట్రీల్లో సగానికి పైగా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ శుక్రవారానికే అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు.