Ponniyin Selvan- Mahesh Babu: పొన్నియిన్ సెల్వన్ మూవీలో మహేష్ నటించాల్సింది. మణిరత్నం ఆయన కోసం చాలా ప్రయత్నాలే చేశారు. కోలీవుడ్ స్టార్ విజయ్, మహేష్ కాంబినేషన్ లో మూవీ అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. పొన్నియిన్ సెల్వన్ మూవీలో వీరిద్దరూ నటించాల్సింది. విజయ్-మహేష్ లతో మణిరత్నం టెస్ట్ షూట్ చేశారని, మేకప్ టెస్ట్స్ కూడా జరిగాయని వార్తలు వెలువడ్డాయి. టెస్ట్ షూట్ జరిపారన్న దాంట్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ… పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో మహేష్, విజయ్ లను నటింపజేయాలని మణిరత్నం ప్రయత్నం చేశారు.

పొన్నియిన్ సెల్వన్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా విడుదల చేయాలని భావించిన మణిరత్నం సౌత్ ఇండియాలో భారీ ఫేమ్ ఉన్న మహేష్-విజయ్ కరెక్ట్ ఛాయిస్ అనుకున్నారు. దాని కోసం చివరి వరకు ప్రయత్నం చేశారు. విజయ్ అయితే మధ్యలో తప్పుకున్నట్లు సమాచారం. మహేష్ మాత్రం ఈ చిత్రాన్ని మొదట్లోనే రిజెక్ట్ చేశారు. పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో మహేష్ కోసం మణిరత్నం ఎంపిక చేసిన పాత్ర ఆయనకు నచ్చలేదు. దీంతో సున్నితంగా తిరస్కరించారు.
మణిరత్నం లాంటి దర్శకుడితో మూవీ చేయాలని ఏ హీరోకైనా ఉంటుంది. మహేష్ సైతం పలు సందర్భాల్లో మణిరత్నం గారితో సినిమా చేయడం తన డ్రీం అన్నారు. అలాంటప్పుడు ఓ భారీ పాన్ ఇండియా ఆఫర్ మణిరత్నం స్వయంగా ఇస్తే ఎందుకు కాదన్నారనే సందేహం కలగవచ్చు. పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో మహేష్ కి అరుళ్మోజి వర్మన్ పాత్ర ఇచ్చారట. ప్రస్తుతం ఈ పాత్ర జయం రవి చేశారు. కథలో అంతగా ప్రాధాన్యత లేని పాత్ర కావడంతో, నాకు సెట్ కాదని మహేష్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారట.

టాప్ స్టార్ ఇమేజ్ కలిగిన మహేష్… ఇలాంటి రిస్క్ చేయకపోవడమే మంచిదని భావించారు. సినిమా విడుదలయ్యాక ఆయన నిర్ణయం సరైందని తెలిసింది. కారణం పొన్నియిన్ సెల్వన్ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. అలాగే జయం రవి పాత్రకు కొంత ప్రాధాన్యత ఉన్నప్పటికీ… మహేష్ ఇమేజ్ కి సరిపోయేంత కాదు. అలాగే రాజమౌళి మూవీతో ఆయన పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వడం గొప్ప ఛాయిస్ అవుతుంది. పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో నటిస్తే గుంపులో గోవిందలా… కలిసిపోయేవాడు. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ తో మూవీ చేస్తుండగా, రాజమౌళి మూవీ వచ్చే ఏడాది ప్రారంభం సెట్స్ పైకి వెళ్లనుంది.