Sai Pallavi: పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లు.. హీరోయిన్స్ నందు సాయి పల్లవి వేరయా అని చెప్పొచ్చు. ఈ తరం హీరోయిన్స్ లో సాయి పల్లవి చాలా ప్రత్యేకం. ఆమె ఆలోచనలు, పద్ధతులు, నియమాలు విభిన్నం. ఆఫర్ ఇస్తానంటే దేనికైనా సిద్దమనే హీరోయిన్స్ ఉన్న ఈ రోజుల్లో పాత్ర నచ్చితేనే చేస్తానని చెప్పే ఏకైన హీరోయిన్. నా నిర్ణయాలను గౌరవిస్తూ అవకాశాలు వస్తే సినిమాలు చేస్తా లేదంటే డాక్టర్ పని చేసుకుంటా.. అని సాయి పల్లవి ధైర్యంగా చెబుతుంది. సినిమాలో కూడా మేకప్ లేకుండా నటించే రేర్ హీరోయిన్ సాయి పల్లవి మాత్రమే.

చెప్పాలంటే సాయి పల్లవి హీరోయిన్ మెటీరియల్ కానప్పటికీ తనలో ఆకర్షించే అనేక అంశాలు ఉన్నాయి. తన నటన, డాన్స్ తో పాటు ఆమె నవ్వులో, కళ్ళలో ఏదో మాయ ఉంది. అది ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. సాయి పల్లవి తెరపై కనిపిస్తే ప్రేక్షకులు ఆమెతో పాటు ట్రావెల్ చేస్తారు. మంచి పాత్రలు ఎంచుకోవడం, వాటిని అద్భుతంగా రక్తి కట్టించడం ద్వారా సాయి పల్లవి అది చేయగలుతున్నారు. సాయి పల్లవి నటన, డాన్స్ నేర్చుకోకపోవడం మరో విశేషం.
పొడవైన జుట్టు, ముఖంపై మొటిమలతో సాయి పల్లవి చాలా సహజంగా కనిపిస్తుంది. ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అవుతున్నా ఆమె శరీరంలో పెద్దగా మార్పు రాలేదు. సాయి పల్లవి బరుపు పెరగడం తగ్గడం జరగలేదు. ఒక టైం అంటూ ఉండని ఇండస్ట్రీలో స్లిమ్ బాడీ మైంటైన్ చేయడం చాలా కష్టం. దాని కోసం హీరోయిన్స్ కడుపు మాడ్చుకుంటారు. గంటల తరబడి వ్యాయామం, యోగా, మెడిటేషన్ చేస్తారు. కానీ సాయి పల్లవి అవేమీ చేయదు. అయినప్పటికీ ఆమె అంత ఫిట్ గా ఉండటానికి కారణం… అలవాట్లు, సహజంగా సంక్రమించిన శరీరతత్వం.

జెనెటిక్ గా సాయి పల్లవిది త్వరగా బరువు పెరిగే శరీరం కాదు. అలాగే ఆమె పూర్తిగా శాకాహారి. నాన్ వెజ్ అసలు ముట్టదు. పప్పు, అన్నం ఉంటే చాలు సరిపెట్టుకుంటుంది. కొబ్బరి నీళ్లు, మజ్జిగా ఎక్కువగా తాగుతారు. సెట్స్ లో కూడా అవి ఉంటే చాలు. కూల్ డ్రింక్స్, కాఫీలు పెద్దగా ఇష్టపడరు. అసలు జిమ్ కి వెళ్లరు. ఇంటి దగ్గర కూడా వ్యాయామం చేయరు. ఎప్పుడైనా అమ్మ, చెల్లితో పాటు బాడ్మింటన్ ఆడతారు. మొబైల్ అతిగా వాడారు, సోషల్ మీడియాలో తక్కువగా కనిపిస్తారు. ఈ లక్షణాలు, అలవాట్లు ఆమెను సహజ సుందరిగా మార్చేశాయి.