Akkineni Nageswara Rao: ధర్మపత్నిగా…. దేవదాసుగా.. మాటలతో అలరించే విధంగా విప్రనారాయణలా.. ఇలా అన్ని వేరియంట్లలో నటిస్తూ సినీ జనాలను ఆకట్టుకున్న బహూదూరపు బాటసారి అక్కినేని నాగేశ్వర్ రావు. 83 ఏళ్ల సినీ ప్రస్తాణంలో 78 ఏళ్ల పాటు తన దైన నటనతో ఆకట్టుకున్న ఏఎన్నార్ చనిపోయే వరకు సినిమాల్లో నటించడం విశేషం. ఎన్నో అవార్డులు.. ఎందరిచేతనో ప్రశంసలు దక్కించుకున్న ఏఎన్నార్ సినిమాలు ఇప్పటికీ అలరిస్తూనే ఉంటాయి. ఆయన మనమధ్య లేకున్నా.. నటించిన సినిమాలు కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. తెలుగుచిత్ర సీమలో నెంబర్ 2గా ఉన్న అక్కినేని నాగేశ్వర్ 1924 సెప్టెంబర్ 20న జన్మించారు. నాటకాల ద్వారా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన గురించి కొన్ని విశేషాలు.
చిత్ర పరిశ్రమను మద్రాసు నుంచి ఆంధ్రకు తీసుకురావడంలో కృషి చేసిన వ్యక్తుల్లో ఏఎన్నార్ ఒకరు. అలాంటి ఏఎన్నార్ ను ఎవరూ మరిచిపోరు. కృష్ణా జిల్లా గుడివాడ తాలుకా నందివాడ మండలం రామాపురంలో జన్మించిన ఆయన చిన్నప్పుడే కళా రంగంలోకి అడుగుపెట్టారు. నాటకాల్లో ఆడవారి పాత్రలు వేయడంలో అక్కినేని ప్రత్యేకత సాధించాడు. ఆ తరువాత ఆయన నటనను మెచ్చిన ఘంటసాల బాలరామయ్య తనను సినిమాల్లోకి తీసుకురావాలని అనుకున్నాడు. ఈ క్రమంలో ఆయనకు 1941లో పి పుల్లయ్య దర్శకత్వంలో ‘ధర్మపత్ని’ అనే సినిమాలో మొదటిసారిగా బాలనటుడిగా వేషం వేశాడు. ఆ తరువాత ఘంటసాల బాలరామయ్య డైరెక్షన్లో ‘సీతారామ జననం’ అనే సినిమాలో నటించిన తరువాత పూర్తిస్థాయి నటుడిగా మారిపోయాడు.
అక్కడి నుంచి వెనుదిరిగి చూడకుండా అక్కినేని వరుసగా సినిమాల్లో నటిస్తూ వచ్చాడు. 1953 లో ‘దేవదాసు’ చిత్రంతో ఆల టైం హీరో అనిపించుకున్నాడు. 1966లో విడుదలైన ‘నవరాత్రి’ సినిమాలో ఏఎన్నార్ ఏకంగా 9 పాత్రల్లో నటించి మెప్పించాడు. ఇలా సినీ ప్రస్థానంలో విజయవంతంగా కొనసాగుతున్న ఆయన తన భార్య అన్నపూర్ణ పేరుమీద 1975లో సినీ స్టూడియోను ప్రారంభించారు. ఆ తరువాత అన్నపూర్ణ బ్యానర్ పై వచ్చిన ‘ప్రేమాభిషేకం’ సంచలన సినిమాగా గుర్తింపు పొందింది.
అక్కినేని నాగేశ్వర్ రావుకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. అక్కినేని వెంకట్, అక్కినేని నాగార్జునలు కుమారులు కాగా.. సత్యవతి, నాగ సుశీల, సరోజలు కుమార్తెలు. వీరిలో అక్కినేని నాగార్జున నట వారసత్వాన్ని పుచ్చుకొని సినిమాల్లో స్టార్ హీరోగా కొనసాగుతూ తండ్రిపేరును నిలబెడుతున్నారు. అక్కినేని నాగార్జున కుమారులు, తండ్రి నాగేశ్వర్ రావు లు కలిసి ‘మనం ’ అనే సినిమాలో నటించారు. అక్కినేని నాగేశ్వర్ రావుకు ఇదే ఆఖరి మూవీ. 91 ఏళ్ల పాటు జీవితంలో ఎన్నో విశేషాలు సాధించిన అక్కినేని నాగేశ్వర్ రావు 2014 జనవరి 22న అర్ధరాత్రి మరణించారు.