Director Shankar : అద్భుతమైన టేకింగ్ తో ఇండియన్ సెల్యులాయిడ్ పై తనదైన ముద్రవేసిన దర్శకుడు శంకర్. తీసిన ప్రతి సినిమా హిట్టే అన్నట్టుగా సాగిన ఆయన కెరీర్.. ఇప్పుడు ఏది ముట్టుకున్నా వివాదమే అన్నట్టుగా మారిపోయింది. వరుసగా వెంటాడుతున్న వివాదాలు.. ఆయనకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయనే చెప్పాలి.
కమల్ హాసన్ తో రెండు దశాబ్దాల క్రితం తీసిన ఇండియన్ (భారతీయుడు) సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్ గా ఇండియన్-2 మొదలు పెట్టారు. కానీ.. బడ్జెట్ విషయంతోపాటు ఇతరత్రా వ్యవహారాల్లో నిర్మాతలు, దర్శకుడి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో.. ఈ సినిమా మధ్యలో ఆగిపోయింది. దీనిపై నిర్మాతలు కోర్టుకు సైతం వెళ్లారు. మరి, ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుంది? అసలు తీస్తారా? పక్కనపడేస్తారా? అనే స్పష్టత లేదు.
ఇదిలాఉంటే.. రోబో చిత్రంపై ఆరూర్ తమిళ్‌నాదన్ అనే వ్యక్తి గతంలోనే కేసు వేశారు. తాను రాసిన కథనే రోబోగా చిత్రీకరించారంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. ‘జిగుబా’ అనే టైటిల్ తో తాను రాసిన కథ ఆధారంగానే రోబో చిత్రాన్ని తీశారని, అందుకు తన అనుమతి తీసుకోలేదు అంటూ తమిళనాదన్ కోర్టులో కేసువేశాడు. ఈ వివాదంపై కొన్నేళ్లుగా విచారణ సాగుతోంది.
ఇక, మొన్న ‘అపరిచితుడు’ హిందీ రీమేక్ అనౌన్స్ చేసిన వెంటనే అభ్యంతరం వచ్చిపడింది. బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించారు శంకర్. బాలీవుడ్ ప్రొడ్యూసర్ జయంతి లాల్ నిర్మించడానికి సిద్ధమయ్యారు. అయితే.. మర్నాడే అపరిచితుడు ఒరిజినల్ వెర్షన్ నిర్మాత రవిచంద్రన్ స్పందించారు. ఆ కథపై పూర్తి హక్కులు తనవేనని, తన అనుమతి లేకుండా సినిమాను తెరకెక్కిస్తే ఊరుకునేది లేదన్నారు.
ఇప్పుడు లేటెస్ట్ వివాదం రామ్ చరణ్ సినిమాకు సంబంధించినది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ చిత్రం తన కథతోనే తెరకెక్కిస్తున్నారంటూ తమిళ రచయిత సెల్లముత్తు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు రైటర్స్ అసోసియేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. కార్తీక్ సుబ్బరాజుతో కలిసి తాను ఈ స్టోరీని సిద్ధం చేశానని చెబుతున్నారు. ఈ విధంగా శంకర్ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. మరి, ఇన్ని గొడవల మధ్య చెర్రీ సినిమాను శంకర్ ఎలా పూర్తిచేస్తారో చూడాలి.