Disco Shanti: నటుడు శ్రీహరి జీవితం ముగిసిన తీరు అత్యంత బాధాకరం. చివరి శ్వాస వరకు ఆయన నటిస్తూనే ఉన్నారు. పరిశ్రమలో ఆయన ఎదిగిన తీరు ఎందరికో స్ఫూర్తిదాయకం. విలన్ గా ఎంట్రీ ఇచ్చి రియల్ స్టార్ అయ్యాడు. హీరోగా సూపర్ హిట్స్ ఇచ్చాడు. ఒక దశలో శ్రీహరి మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన నటించిన దేవా, సాంబయ్య, పోలీస్, భద్రాచలం సూపర్ హిట్స్ అయ్యాయి. హీరోగా ఫేడ్ అవుట్ అవుతున్న దశలో శ్రీహరి మల్టీస్టారర్స్ చేశారు. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయడం శ్రీహరికి ఉన్న గొప్ప టాలెంట్. ఆయన కమెడియన్ గా నవ్వులు పూయించగలడు విలన్ గా క్రూరత్వం చూపించగలడు.

పరిశ్రమలో శ్రీహరికి అజాతశత్రువు అన్న పేరుంది. అందరితో ఆయన బాగుండేవారు. మంచి మనిషిగా సాయం కోసం వచ్చిన అనేక మందిని ఆదుకున్నారు. మూడో కంటికి తెలియకుండా దానాలు చేశారు. అయితే పరిశ్రమలో కొందరు వ్యక్తులు ఆయనను మోసం చేసినట్లు శ్రీహరి భార్య శాంతి తెలియజేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రీహరి మరణం తర్వాత ఎదురైన ఆర్థిక ఇబ్బందుల గురించి వెల్లడించారు. శ్రీహరి చేసిన చిత్రాల రెమ్యూనరేషన్ కరెక్ట్ గా తీసుకొని ఉంటే పది ఇళ్ళు కొనుక్కునే వాళ్ళం. కానీ ఆయన మరణించేనాటికి ఇంటిపై అప్పు ఉంది.
నా నగలు అమ్మేసి ఆ అప్పులు తీర్చాను. అలాగే కార్లు కూడా అమ్మాల్సి వచ్చింది. ఆరోజుల్లో చిరంజీవి నిర్మాణ సంస్థతో పాటు రెండు మూడు సంస్థలు మాత్రమే సక్రమంగా డబ్బులు ఇచ్చారు. చాలా మంది శ్రీహరికి డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారు. శ్రీహరి బావకు సినిమా అంటే పిచ్చి… దాంతో డబ్బులు ఇచ్చినా ఇవ్వకున్నా సినిమాలు చేయమని నేను చెప్పేదానిని, అని డిస్కో శాంతి తెలియజేశారు. ఆయన మరణం తర్వాత ఏం చేస్తున్నారని చాలా మంది అడుగుతూ ఉంటారు. నేను సినిమాలు కూడా చేయడం లేదు, దాంతో ఎవరూ పట్టించుకోవడం లేదని శాంతి ఆవేదన చెందారు.

అప్పట్లో డాన్సర్ గా డిస్కో శాంతి చాలా ఫేమస్. నటుడు శ్రీహరి ప్రేమించి శాంతిని వివాహం చేసుకున్నారు. 1996లో వీరి వివాహం జరిగింది. 2013 అక్టోబర్ 9న శ్రీహరి ముంబైలో మరణించారు. హిందీ చిత్రం ఆర్ రాజ్ కుమార్ చిత్ర షూటింగ్ లో శ్రీహరి పాల్గొన్నారు. అస్వస్థతకు గురైన శ్రీహరిని లీలావతి హాస్పిటల్ కి తరలించారు. లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శ్రీహరి అక్కడే మరణించారు. శ్రీహరి పెద్ద కొడుకు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.