Dil Raju : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్నడూ లేని విధంగా బయ్యర్స్ వచ్చిన లాభాలకు ఎంతో సంతృప్తి చెందుతూ నిర్మాతలను అభినందించడానికి ఒక ప్రత్యేక ఈవెంట్ ని జరిపించడం విక్టరీ వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి మాత్రమే జరిగింది. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రానికి 100 శాతం లాభాలు కాదు, ఏకంగా 400 శాతం లాభాలు వచ్చాయి. టాలీవుడ్ లో ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్స్ ‘గేమ్ చేంజర్’ చిత్రాన్ని కూడా కొనుగోలు చేసారు. ‘గేమ్ చేంజర్’ కి భారీ నష్టాలు వస్తే, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ఆ నష్టాలను పూడ్చి బయ్యర్స్ ని లాభాల బాట నడిపించింది. మమ్మల్ని కాపాడినందుకు కృతఙ్ఞతలు అంటూ దిల్ రాజు ని, ఆ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడిని అభినందిస్తూ కాసేపటి క్రితమే ఒక ఈవెంట్ ని నిర్వహించారు.
ఈ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘బయ్యర్స్ సాధారణంగా ఒక సినిమాకి లాభాలు వచ్చాయని మనస్ఫూర్తిగా చెప్పుకోరు. కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి వాళ్ళే స్వయంగా ఈవెంట్ ని ఏర్పాటు చేసి మాకు అభినందనలు తెలిపారు. టాలీవుడ్ హిస్టరీ లో ఇలా జరగడం ఇదే తొలిసారి అనుకుంట. మేము కష్టాల్లో ఉన్నప్పుడు ఇటీవల మాతో కలిసి నడిచిన ఎంతో మంది బయ్యర్స్ మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు. కానీ హరి, LVR వంటి వాళ్ళు మాత్రం మాతో ఎన్ని కష్టాలొచ్చినా ఉన్నారు. బొమ్మరిల్లు నుండి మా ప్రయాణం మొదలైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు మాతో కొనసాగుతూనే ఉన్నారు. ఈ సంక్రాంతి నాకు ఎన్నో గుణపాఠాలు నేర్పింది. నా కెరీర్ లో ఘనవిజయం సాధించిన సినిమాలన్నీ కొత్త దర్శకులతో చేసినవే ఉన్నాయి, కాంబినేషన్స్ లో మేము చేసిన సినిమాలు చాలా తక్కువ’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘గత రెండు మూడు ఏళ్లుగా మేము కాంబినేషన్స్ వెంట పరుగులు తీసి చేతులు కాల్చుకున్నాం. మళ్ళీ అలాంటి రిస్క్ చేయబోము. ఈ చిత్రానికి ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాము. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్స్ వ్యవస్థ చిన్నగా తొలగిపోతుంది. కేవలం 10 శాతం సక్సెస్ రేట్ ఉన్న ఇండస్ట్రీ మనది. ఆ పది శాతం సక్సెస్ రేట్ లోనే భారీ లాభాలను తెచ్చుకోవాల్సి ఉంటుంది. అందుకే డిస్ట్రిబ్యూటర్స్ వ్యవస్థ బలహీనపడి ఇప్పుడు ఇద్దరు, ముగ్గురు మిగిలారు. ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు వాళ్ళ ఆనందానికి హద్దులే ఉండవు’ అంటూ చెప్పుకొచ్చాడు దిల్ రాజు. ఇప్పటికీ ఈ చిత్రం హౌస్ ఫుల్స్ కలెక్షన్స్ తోనే నడుస్తుందని, అనేక ప్రాంతాల్లో ఈ చిత్రానికి టాప్ 1 , టాప్ 2 రేంజ్ వసూళ్లు వచ్చాయి అని చెప్పుకొచ్చారు బయ్యర్స్.