Jailer 2 Teaser : సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో ఎన్నో మైల్ స్టోన్స్ ఉన్నాయి. కానీ 2023 వ సంవత్సరంలో విడుదలైన ‘జైలర్’ చిత్రం రజినీకాంత్ కి, ఆయన అభిమానులకు ఎంతో ప్రత్యేకం. ఈ చిత్రానికి ముందు ఆయన చేసిన సినిమాలు వరుసగా డిజాస్టర్ ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ‘పేట’, ‘దర్బార్’ లాంటి యావరేజ్ గ్రాసర్ సినిమాలు మధ్యలో వచ్చాయి కానీ, అవి రజినీకాంత్ స్టార్ స్టేటస్ కి తగ్గ సినిమాలు మాత్రం కావు. ఇక రజినీకాంత్ పని అయిపోయింది, ఎంతైనా వయసు మీదకి వచ్చేసింది కదా అని అందరూ అనుకున్నారు. ఆయన అభిమానులు కూడా చాలా వరకు ఆశలు వదిలేసుకున్నారు. అలాంటి సమయంలో విడుదలైన ఈ ‘జైలర్’ చిత్రం సృష్టించిన సెన్సేషన్ ని చూసి నేటి తరం ప్రేక్షకులు నోరెళ్లబెట్టారు. రజినీకాంత్ స్థాయి తగ్గింది అన్నందుకు లెంపలు వేసుకున్నారు. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ నెల్సన్ ‘జైలర్’ విడుదలైన కొత్తల్లోనే ప్రకటించాడు.
గత ఏడాది నవంబర్ నెలలో ప్రోమో కి సంబంధించిన షూటింగ్ ని చేసారు. రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రోమో ని విడుదల చేస్తారని అభిమానులు చాలా ఆశపడ్డారు కానీ, అది జరగలేదు. నేడు ఈ టీజర్ ని కాసేపటి క్రితమే విడుదల చేసారు. ఈ టీజర్ ని చూస్తుంటే పార్ట్ 1 కి మించిన ర్యాంపేజ్ ఉందని అభిమానులకు అర్థమైపోయింది. డైరెక్టర్ నెల్సన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఇద్దరు కలిసి ఉన్న ఈ టీజర్ వీడియో లో ‘జైలర్’ తర్వాత ఎలాంటి సినిమాలు చేయలేదు. ఈలోపు అమెరికా కి మరోసారి ట్రంప్ ప్రెసిడెంట్ అయిపోయాడు, దేశంలో ఎన్నో మార్పులు వచ్చాయి అని ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోపు రజినీకాంత్ విలన్స్ ని చంపుకుంటూ వస్తుంటాడు. చివరికి వీళ్లిద్దరు ఉంటున్న ఇంట్లోకి కూడా మందుపాతర విసిరి వెళ్తాడు. ఇదంతా గమనిస్తూ ఉంటే ‘రజినీకాంత్’ ని ఈ చిత్రం లో డైరెక్టర్ ఎంత వయొలెంట్ గా చూపించబోతున్నాడా అర్థం చేసుకోవచ్చు.
‘జైలర్’ చిత్రం లో ఇంటర్వెల్ ముందు వరకు రజినీకాంత్ ని చాలా కూల్ గా, రిటైర్ అయినా జైలర్ గా, కుటుంబం తో కలిసి బ్రతుకుతున్న ఒక సామాన్యుడిగా చూపించారు. ఇంటర్వెల్ నుండి ఆయన తన విశ్వరూపం చూపిస్తాడు. వామ్మో ఇంత వయొలెంట్ గా ఉన్నదేంటి అని విలన్స్ కూడా వణికిపోయే రేంజ్ లో ఆయన క్యారక్టర్ ని చూపించాడు డైరెక్టర్. పార్ట్ 2 లో ఆ క్యారక్టర్ సినిమా మొత్తం ఉండనుంది. ఎలాంటి జాలి, దయ లేకుండా శత్రువుల గుండెల్లో నిద్రపోయే పాత్రలో రజినీకాంత్ ఇందులో కనిపించబోతున్నాడు. న్యాయం గా లేడని సొంత కొడుకునే చంపేసిన ఈ జైలర్ పాత్ర, రెండవ భాగం లో ఎలా ఉండబోతుంది అనేది రజినీ అభిమానులకే కాదు, ఇతర హీరోల అభిమానులకు కూడా ఆతృతగా ఉంది. ఈ ఏడాది ద్వితీయార్థం లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.