Megastar Chiranjeevi : సినీ ప్రముఖులందరూ నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన ఘటన ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశం గా మారింది. తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ చైర్మన్ దిల్ రాజు తో కలిసి నాగార్జున, వెంకటేష్ వంటి టాప్ స్టార్ హీరోలతో పాటు, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, డైరెక్టర్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్, రాఘవేంద్ర రావు వంటి వారు ఈ సమావేశం లో పాల్గొన్నారు. అయితే హైదరాబాద్ లో ఉన్నప్పటికీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు ఈ సమావేశానికి హాజరు కాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఆయనకీ బదులుగా సెక్రటరీ శివ బాలాజీ ఈ సమావేశం లో పాల్గొన్నాడు. అయితే ఇండస్ట్రీ కి ఏ చిన్న సమస్య వచ్చినా, ఇండస్ట్రీ కి పెద్దన్న పాత్ర పోషిస్తూ మెగాస్టార్ చిరంజీవి పరిష్కరించేవాడు. ఈ సమావేశానికి కూడా ఆయన వచ్చి సీఎం తో మాట్లాడుతాడని అనుకున్నారు కానీ, ఆయన ఈ సమావేశం లో పాల్గొనకపోవడం ఆశ్చర్యానికి గురి చేసిన విషయం.
అయితే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించే వార్త ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రావాల్సిన అవసరం లేదని చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే చిరంజీవి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాడు, కష్టాల్లో ఉన్న ప్రతీ ఒక్కరిని ఆయన ఆదుకున్నాడు, కరోనా సమయం లో సినీ ఇండస్ట్రీ కి సంబంధించిన కార్మికులకు తన సొంత చారిటీ ట్రస్టు ద్వారా నిత్యావసర సరుకులు అందించాడు, అదే విధంగా కరోనా సమయంలో ఆక్సిజన్ సిలెండర్లను రాష్ట్ర వ్యాప్తంగా తన సొంత డబ్బులతో ఖర్చు చేసాడు. సమాజం పట్ల ఇంత బాధ్యతతో వ్యవహరించే ఆయన్ని పిలిచి, ఇలాంటి సమావేశం లో అలా చెయ్యి, ఇలా చెయ్యి అని సూచనలు ఇవ్వడం సబబు కాదు, ఆయన తరుపున ఇండస్ట్రీ రావడమే ఉత్తమం అని సీఎం రేవంత్ రెడ్డి తన అధికారులతో అన్నాడట.
అందుకే చిరంజీవి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, ఆయన గౌరవ మర్యాదలకు భంగం కలగకూడదనే ఉద్దేశ్యంతోనే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. పైగా చిరంజీవి సోదరుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య ఎలాంటి పొరపొచ్చాలు రాకూడదనే ఉద్దేశ్యంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఈ సమావేశం తర్వాత నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘ఈ సమావేశం టికెట్ హైక్స్ కోసమో, లేదా బెనిఫిట్ షోస్ కోసమో జరిగింది కాదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ భవిష్యత్తులో ప్రపంచ వ్యాప్తంగా చక్రం తిప్పేందుకు, హాలీవుడ్ దర్శక నిర్మాతలు సైతం హైదరాబాద్ కి వచ్చి మూవీ షూటింగ్స్ చేసుకునే స్థాయికి ఎలా ఎదగాలి అనే విషయాలపై చర్చలు జరిపాము’ అంటూ ఈ సందర్భంగా దిల్ రాజు తెలిపాడు. చూడాలి మరి ఈ కీలక చర్చల పరిణామం భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేది.