Dhurandhar Movie Fake Photos Controversy: బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తున్న దురంధర్ సినిమా సక్సెస్ కొందరికి గిట్టడం లేదు. పాకిస్తాన్ వాస్తవ స్వరూపాన్ని బయట పెట్టడంతోపాటు భారత ప్రభుత్వం నిర్వహించిన కౌంటర్ టెర్రరిజం దాని సక్సెస్ స్టోరీ వాళ్లకు అర్థం కావడం లేదు. ఇది ఒక మతానికి వ్యతిరేకం అని అంటున్నారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకం అయితే ఇస్లామ్‌కు వ్యతిరేకం ఎలా అవుతుంది. సినిమాను విమర్శించేందుకు ప్రాపగాండ సినిమా అంటున్నారు. మరి ప్రాపగాండ సినిమా ఏది కాదు అన్న ప్రశ్న తలెత్తింది. తాజాగా సిక్కు మత మనోభావాలను దెబ్బతీసేలా సినిమాలో సీన్లు ఉన్నాయని ఆరోపిస్తూ, ఏఐ ద్వారా తయారు చేసిన ఫేక్ ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
వివాదం వెనుక ఉన్న వాస్తవం
సిక్కు మతంలో పొగతాగడం ఘోరమైన నేరం, మత విరోధం. ఈ అంశాన్ని ఆసరాగా చేసుకుని, సినిమా హీరో రణ్వీర్ సింగ్ సిగరెట్ తాగుతున్నట్లుగా ఒక ఫొటోను సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఆ ఫొటోలో రణ్వీర్ సింగ్ తలపాగ(టర్బన్) ధరించి, సిగరెట్ తాగుతున్నట్లు చూపించారు. ఇది సిక్కు సమాజంలో పెద్ద దుమారం రేపింది. వెంటనే కొందరు సంఘాలు సినిమాపై కేసు పెట్టేందుకు సిద్ధమయ్యాయి, బ్యాన్ చేయాలని డిమాండ్ చేశాయి.
ఏఐ మార్ఫింగ్ బయటపడింది
కానీ, ఈ ఫొటోల వెనుక ఉన్న నిజాన్ని దర్శకుడు ఆదిత్య ధర్ బయటపెట్టారు. వైరల్ అవుతున్న ఆ చిత్రాలు పూర్తిగా అవాస్తవమని, అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మార్ఫింగ్ చేసినవని ఆయన స్పష్టం చేశారు. సినిమాలో కానీ, అధికారిక వీడియోల్లో కానీ అలాంటి సీన్ లేదని, ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా అలజడులు సృష్టించాలని కొందరు చేస్తోన్న పని అని ఆయన వెల్లడించారు. ‘సిక్కులు అంటే నాకెంతో గౌరవం. మా సినిమా ఎవరి మనోభావాలనూ దెబ్బతీయదు‘ అని ఆదిత్య ధర్ ప్రకటించారు.
విమర్శల వెనుక రాజకీయ కోణం
దురంధర్ సినిమాపై వస్తున్న విమర్శలను గమనిస్తే, అవి కేవలం మతపరమైనవి కావని, వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని అర్థమవుతోంది. సినిమా పాకిస్తాన్‌కు వ్యతిరేకం అయితే, దాన్ని ఇస్లాం మతానికి వ్యతిరేకం అని ప్రచారం చేస్తున్నారు. కానీ, ఉగ్రవాదానికి మతం లేదని, పాకిస్తాన్ ప్రభుత్వం ఆశ్రయిస్తున్న ఉగ్రవాదులను బయటపెట్టడం ఇస్లాం వ్యతిరేకత ఎలా అవుతుందన్న ప్రశ్నకు సమాధానం లేదు. సినిమాను ’ప్రొపగాండా’ అని విమర్శిస్తున్నారు. కానీ, దేశ భద్రత, ఉగ్రవాదంపై పోరాటాన్ని చూపించే ప్రతి సినిమా ప్రచార సినిమా అయితే, ప్రచార సినిమా ఏది కాదన్న ప్రశ్న తలెత్తుతోంది.
దురంధర్ సినిమా వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లు వసూలు చేసింది. ఈ విజయం కొందరికి జీర్ణం కావడం లేదు. దీంతోనే మతపరమైన అంశాలను తెచ్చి, సినిమాను నిలువరించే యత్నం జరుగుతోంది.