Deva Katta: దర్శకుడు దేవా కట్టాకు జేబు సంతృప్తి దక్కకపోయినా జాబు సంతృప్తి దొరికింది. ఆయన తీసిన ‘రిపబ్లిక్’ సినిమా గత వారం విడుదలై యావరేజ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టడానికి కిందామీదా పడుతుంది. కొన్ని చోట్ల ఇక ఇప్పటికే జెండా ఎత్తేసింది. మరికొన్ని చోట్ల కష్టంగా నడుస్తూ నష్టాలు ఊబిలో చిక్కుకుంది. దీంతో సహజంగానే సినిమా టీమ్ డీలా పడుతుంది.

ఈ క్రమంలో దేవా కట్టా కూడా బాగా ఫీల్ అయ్యాడు. అయితే, రోజులు గడిచే కొద్దీ.. సినిమాలో మ్యాటర్ జనం హృదయాల్లోకి చొచ్చుకుపోతున్న కొద్దీ సినిమా పై ప్రశంసల వర్షం కురుస్తోంది. మొదట విమర్శకుల నుంచి మిశ్రమ రేటింగ్ వచ్చినా.. ఆ తర్వాత వాళ్లే సినిమాలో కొన్ని అంశాలు చాలా బాగున్నాయి అంటూ పాజిటివ్ కామెంట్స్ చేశారు.
అయితే, గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో దేవా కట్టాకి విపరీతమైన కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. నేటి రాజకీయాలకు అద్దం పట్టేలా నేటి రాజకీయ నాయకుల జీవితాలను ప్రతిబింబించేలా సినిమా తీయడం ఒక్క దేవా కట్టకు మాత్రమే సాధ్యం అంటూ నెటిజన్లు మెచ్చుకుంటూ పోస్ట్ లు పెడుతున్నారు. ముఖ్యంగా డైలాగ్ లకు సూపర్ రెస్పాన్స్ వస్తున్నాయి.
డైలాగులు అద్భుతం అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. నిజానికి ఈ సినిమా నిరాశావాదంతో ముగిసింది. సహజంగానే ఇలాంటి ముగింపులు మనవాళ్లకు పెద్దగా నచ్చవు. కానీ ఆ ట్రాజిక్ ఎండింగే అద్భుతం అంటూ, అది వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది అంటూ ఈ సినిమా క్లైమాక్స్ అదిరిపోయింది అని నెటిజన్లు తమ ఆనందాన్ని వ్యక్తపరచడం దేవా కట్టాకు ఎక్కడా లేని సంతోషాన్ని కలిగిస్తోందట.
అందుకే, ఈ సినిమా గురించి పాజిటివ్ గా ట్వీట్ చేసిన ప్రతి ఒక్కరికి దర్శకుడు దేవా కట్టా రీట్వీట్ చేస్తూ ఈ సినిమాకి ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ తో తనకు ఎంతో సంతోషంగా కలిగిస్తున్నట్లు దేవా కట్టా చెప్పుకొచ్చాడు. మొత్తానికి జేబు సంతృప్తి లేకపోయినా జాబు సంతృప్తి దొరికింది అన్నమాట. అన్నట్టు ఈ సినిమాకి పెద్దగా నష్టాలు ఏమి లేవు.
కారణం.. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ కి ముందే అమ్మేశారు. అదే ఇప్పుడు దేవా కట్టాని కాపాడింది. లేకపోతే జాబు సంతృప్తి దొరికినా, బాధ పడాల్సి వచ్చేది.