Demon Pawan father death : ‘అగ్నిపరీక్ష’ షో ద్వారా సామాన్యుల క్యాటగిరీలో ‘బిగ్ బాస్ 9’ రియాలిటీ షో లోకి అడుగుపెట్టిన డిమోన్ పవన్ , హౌస్ లో ఉన్నన్ని రోజులు ఎంత అద్భుతంగా గేమ్ ఆడాడో మనమంతా చూసాము. మధ్యలో కొన్ని బంధాల కారణంగా ఆటలో కాస్త వెనకబడ్డాడు కానీ, చివరి మూడు వారాల్లో డిమోన్ పవన్ లోని అద్భుతమైన టాలెంట్ ని గుర్తించి ప్రేక్షకులు ఆయనకు టాప్ 3 స్థానం లో నిలబెట్టేలా చేశారు. చాలా తెలివిగా 15 లక్షల రూపాయిల సూట్ కేసు తో బయటకు వచ్చాడు. అలా వచ్చినందుకు ఆయన అభిమానులు ఎంతో సంతోషించారు. ఎందుకంటే డిమోన్ పవన్ కుటుంబం చాలా పేదరికం లో ఉంది. ఆయన తండ్రి కి క్యాన్సర్ రావడం వల్ల నాలుక ని కూడా సగం కట్ చేశారు. ‘బిగ్ బాస్ 9’ ఫ్యామిలీ వీక్ లో స్టేజి మీదకు డిమోన్ పవన్ తండ్రి వచ్చి, తన కొడుకు గురించి గర్వంగా మాట్లాడిన మాటలను అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు.
నా కొడుకు కారణంగా నాకు చాలా గర్వంగా ఉంది. సాధారణమైన కుటుంబానికి చెందిన నన్ను , వాడి టాలెంట్ తో ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. ఇంతకు మించి జీవితానికి ఏమి కావాలి అంటూ చాలా ఎమోషనల్ అయిపోయాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కొడుకు జీవితం లో సక్సెస్ అవ్వగానే చనిపోవడం దురదృష్టకరం. నాలుగు రోజుల క్రితం తీవ్రమైన అస్వస్థతకు గురై తుది శ్వాసని వదలాల్సి వచ్చింది. అయ్యో పాపం అంటూ సోషల్ మీడియా ప్రతీ ఒక్కరు ఈ సందర్భంగా డిమోన్ పవన్ కి ధైర్యం చెప్తూ సంతాపం వ్యక్తం చేశారు. అయితే నేడు తన తండ్రి అస్థికలను కాశీ కలపడానికి వెళ్తున్న సందర్భంగా డిమోన్ పవన్ విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఆయన మాట్లాడుతూ ‘నా జీవితం లో ఇదే మొట్టమొదటి విమాన ప్రయాణం. వాస్తవానికి ఈ ప్రయాణం తల్లిదండ్రులతో కానీ, ప్రాణ స్నేహితులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే అదొక గొప్ప జ్ఞాపకంగా నా జీవితం లో మిగిలిపోవాలని కోరుకున్నాను. దురదృష్టం కొద్దీ నా తండ్రితో ఫ్లైట్ ఎప్పటికీ ఎక్కలేను, దేవుడు నాకు ఇలా రాసి పెట్టాడు. నా తండ్రి కోసం ఇప్పుడు మొట్టమొదటి విమాన ప్రయాణం ద్వారా కాశీ కి వెళ్ళబోతున్నాను. అక్కడ ఆయన అస్థికలను కలపబోతున్నాను. ఇది నాకు ఒక జ్ఞాపకం గా మిగిలిపోబోతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు డిమోన్ పవన్. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి.