
Dasara Chamkeela Angeelesi : నాటు నాటు ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. తెలుగు సినిమా పాటని ప్రపంచవ్యాప్తం చేసింది. కానీ అందులో గొట్టు పదాలు లేవు. చందస్సు అల్లికలు లేవు. జస్ట్ ఊర్లో మాట్లాడుకునే మాటలు.. పదిమంది కలిసినచోట దొర్లే మాటలు.. ఆ మాటలే పదాలయ్యాయి.. వరుస కట్టి పాటగా మారాయి. ఆ పాట ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్ నుంచి, ఆస్కార్ దాకా అవార్డులను అందుకుంది.. అమెరికా నుంచి అంటార్కిటికా ఊపేస్తోంది. సరిగ్గా ఇలాంటి పల్లె పదాలతోనే దసరా సినిమాలో “చమ్కీ ల అంగీలేసి” అనే పాటను కాసర్ల శ్యామ్ రాశారు. ఈ పాటను రామ్ మిరియాల, ఢీ పాడారు.
పూర్తి తెలంగాణ మాండలికంలో ఈ పాట సాగుతుంది.. పొలం దగ్గర అమ్మలక్కలు నాట్లు వేస్తున్నప్పుడు, చేనులో కలుపుతీస్తున్నప్పుడు సరదాగా అనుకునే మాటలను, చలోక్తులు విసురుకుంటున్నప్పుడు వచ్చే సంభాషణలను కాసర్ల శ్యామ్ పాటగా మలిచాడు.. ఇప్పుడు ఈ పాటే ఒక ఊపు ఊపేస్తోంది..
సాధారణంగా తెలంగాణలో వదిన-మరిదిల మధ్య ఆటపట్టించే సన్నివేశాలు, వాటి చుట్టూ ఎన్నో తెలంగాణ పల్లె పదాలు, జానపదాలు ఉన్నాయి. అందులోని ఒక జానపాద పాటను స్ఫూర్తిగా తీసుకొని రాసిందే ఈ‘చమ్కీల అంగీలేసి’ పాట.. ఈ పాట సిరిసిల్లలో ఎక్కువగా పాపులర్ అయ్యింది. ఈ పదం ఇక్కడి జానపద కళాకారులు తయారు చేసిన ‘వదిన-మరిది’ పాటల్లో ఉంది. దాన్నే కాసర్ల శ్యామ్ స్ఫూర్తిగా తీసుకొని రాసినట్టున్నాడు.
ముఖ్యంగా రామ్, దీక్షిత (ది) పాడిన తీరు అచ్చమైన తెలంగాణను కళ్ళ ముందు ఉంచుతోంది.. దీక్షిత అలియాస్ ది ఇదివరకు సూర్య హీరోగా నటించిన ‘ఆకాశమే హద్దురా’ సినిమాలో ‘కాటుక కనులే’ పాట పాడింది. అది ఎంతో హిట్ అయ్యింది. ఇప్పుడు అచ్చు తెలంగాణలో ఈ పాట పాడింది. అన్నట్టు ఈ దసరా సినిమా సింగరేణి నేపథ్యంలో సాగుతుంది. దానికి అనుగుణంగానే ఈ పాట రాసినట్టు రచయిత కాసర్ల శ్యామ్ చెబుతున్నారు.
అన్నట్టు ఈ కాసర్ల శ్యామ్.. తెలంగాణ మాండలికంలో పాటలు రాయడంలో దిట్ట. అల వైకుంఠపురం లో రాములో రాముల అని రాస్తే అది యూట్యూబ్లో 100 కోట్ల వ్యూయర్ షిప్ దక్కించుకుంది. ఇక బలగం సినిమాలో ఊరు పల్లెటూరు అనే పాట రాస్తే అది కూడా మంచి పేరు సంపాదించింది. ఇక ఈ పాటలో నాని, కీర్తి సురేష్ రెచ్చిపోయి అభినయించారు. ప్రస్తుతం ఈ పాట కూడా శ్యామ్ కెరియర్లో ఒక కలిగితురాయిగా నిలిచిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఇక ఈ పాట నానిని కీర్తి సురేష్ సరదాగా ఆట పట్టించే సందర్భంలో వస్తుందని సినిమా దర్శకుడు శ్రీకాంత్ అంటున్నాడు.. ఈ శ్రీకాంత్ మరెవరో కాదు.. సుకుమార్ దగ్గర పలు విజయవంతమైన సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. పుష్ప సినిమాకు కూడా వర్క్ చేశాడు.. ఆ సినిమాలో ఊ అంటావా మావ, ఊఊ అంటావా మావ అనే పాటను స్ఫూర్తిగా తీసుకొని.. దసరా సినిమాలో చంకీల అంగేలేసి అనే పాటను పెట్టినట్టు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.. ఇక ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్లో సంచలనాలు సృష్టిస్తోంది.
