నటీనటులు : అశ్వంత్ కాంత్ , రుద్ర కాంత్, నైనా గంగూలీ, అప్సర రాణి, ఇర్రా మోర్ తదితరులు.
దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ.
నిర్మాత: సాగర్ మాచనూరు
సినిమాటోగ్రఫీ: మల్హర్ భట్ జోషి
మ్యూజిక్ డైరెక్టర్: పాల్ ప్రవీణ్
ఎడిటర్: సంఘ ప్రతాప్ కుమార్
రేటింగ్ : 2
‘దావూద్ ఇబ్రహీం’ ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్. మరి ఇలాంటి డాన్ జీవిత కథను సినిమాగా తీస్తే, ఆ సినిమా ఏ రేంజ్ లో ఉండాలి ? మరి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన ‘డి కంపెనీ’ సినిమా నిజంగా దావూద్ జీవితానికి తగ్గట్టుగానే ఉందా ? అసలు ఆర్జీవీ సినిమాలో కొంతైనా మ్యాటర్ ఉందా ? రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం.
కథాకమామీషు :
దావూద్ ఇబ్రహీం (అశ్వంత్ కాంత్) తన బ్రదర్ సాబీర్ (రుద్ర కాంత్)తో కలిసి ఒక గ్యాంగ్ ను మెయింటైన్ చేస్తూ తన తెలివితేటలతో తక్కువ టైంలోనే ముంబైలో బాగా ఎదుగుతారు. అయితే వీరిద్దరూ ఒక కానిస్టేబుల్ కొడుకులు కావడం ఇక్కడ కొసమెరుపు. అసలు ఈ అన్నదమ్ములు లైఫ్ లో ఎక్కడ ట్రాక్ తప్పారు ? అలాగే, గ్యాంగ్ వార్స్ కారణంగా వీళ్లు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి ? ఈ మధ్యలో దావూద్ ప్రేమించిన సుజాత ( నైనా గంగూలీ)తో అతని ప్రేమ ఎలా సాగింది ? అసలు అండర్ వరల్డ్ కింగ్ గా ఎదిగిన దావూద్ ఇబ్రహీం ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది ? ఇంతకీ అతని కుటుంబ నేపథ్యం ఎలాంటిది ? అతని అన్నయ్యను ఎవరు చంపారు ? దానికి దావూద్ ఏమి చేశాడు ? లాంటి విషయాలను వర్మ బాగానే తెరకెక్కించాడు.
ఇక నటీనటుల విషయానికి వస్తే దావూద్ ఇబ్రహీం పాత్రలో అశ్వంత్ కాంత్ అద్భుతంగా నటించాడు. దావూద్ లుక్స్ అండ్ గెటప్ అలాగే యాక్షన్ సీన్స్ లో అతని నటన చాలా సహజంగా సాగింది. హీరోయిన్ నైనా గంగూలీ కూడా ముద్దుల సన్నివేశాల్లో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా రెచ్చిపోయి మరీ నటించింది. వీరిద్దరి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాల్లో వీరి కెమిస్ట్రీ చాల బాగుంది. అలాగే సాబీర్ గా రుద్ర కాంత్ నటన, ఐటమ్ సాంగ్ చేసిన అప్సర రాణి డ్యాన్స్, అలాగే వేశ్యగా నటించిన ఇర్రా మోర్ లతో పాటు మిగిలిన చిన్నాచితకా నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.
ప్లస్ పాయింట్స్ :
నటీనటుల నటన,
వర్మ టేకింగ్,
విజువల్స్,
కొంత యాక్షన్ డ్రామా,
మైనస్ పాయింట్స్ ;
కథాకథనాలు,
ఓవర్ బిల్డప్ డ్రామా,
ఇంట్రెస్టింగ్ సాగని అండర్ వరల్డ్ సీన్స్,
రెగ్యులర్ మాస్ మసాలా కంటెంట్,
రొటీన్ నేరేషన్,
వర్మ వాయిస్ ఓవర్,
నేపథ్య సంగీతం.
సినిమా చూడాలా ? వద్దా ?
‘అండర్ వరల్డ్ డ్రామా’లను ఇష్టపడే ప్రేక్షకులకు ఖాళీ టైం మరీ ఎక్కువగా ఉన్నట్లు అయితే, ఈ చిత్రాన్ని ఒకసారి చూడొచ్చు. ఇక మిగిలిన ప్రేక్షక మహాశయులకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తోంది ఏమనగా దయచేసి ఈ రొటీన్ వ్యవహారాల తతంగాన్ని చూసి విసిగి పోవద్దు అని మా మనవి.