
Puri Jagannadh: సినిమా జనంలోకి వెళ్ళాలి అంటే.. పబ్లిసిటీ బాగా చేయాలి. అయితే, ఎంత పబ్లిసిటీ చేసినా సినిమా బాగానే ఉంటుంది అని మాత్రమే చెప్పగలరు. అదే సినిమా చూసిన తర్వాత, నిజంగానే సినిమా బాగుంటే.. అప్పుడు సినిమా అద్భుతంగా ఉందని నమ్మకంగా చెప్పగలరు, అలాగే నమ్మించగలరు కూడా. మొత్తానికి సినిమా పై నమ్మకం అనేది, సినిమా టాక్ కంటే చాలా ముఖ్యం. ఒకసారి సినిమా బాగుంటుంది అని ఆడియన్స్ లో నమ్మకం వస్తే చాలు, ఇక భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వస్తాయి.
అందుకే, తన సినిమా పై ఆ నమ్మకాన్ని కలిగించడానికి పూరి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నాడు. సహజంగా సినిమా పై నమ్మకం ఉంటే.. ఒక రోజు ముందుగానే మీడియాకీ, సెలబ్రెటీలకూ ప్రత్యేక ప్రీమియర్ షోలు వేయడం అనేది ఇండస్ట్రీలో సర్వసాధారణమైన విషయం. కానీ పూరి మాత్రం రెండు రోజులు ముందుగానే ప్రీమియర్స్ వేయడానికి రెడీ అయ్యాడు.
అసలు పూరిలో ఈ ప్రవర్తన చూసి క్రిటిక్స్ కూడా షాక్ అవుతున్నారు. ఎందుకంటే.. పూరి(Puri Jagannadh) సినిమాలు క్రిటిక్స్ కి ఎక్కవు. పక్కా కమర్షియల్ అంశాలు, అలాగే ముఖ్యంగా సినిమాటిక్ అంశాలే పూరి సినిమాల్లో హైలైట్ అవుతూ ఉంటాయి. దాంతో క్రిటిక్స్ పూరి చిత్రాలకు తమ ప్రోత్సాహాన్ని అందించరు. ఇది తెలుసు కాబట్టే.. పూరి కూడా తన సినిమాలకు సంబంధించి క్రిటిక్స్ కు ప్రీమియర్ షోలు వేయడు.
కానీ తన నిర్మాణంలో వస్తోన్న రొమాంటిక్ చిత్రానికి మాత్రం పూరి ప్రీమియర్ షోలను ఏర్పాట్లు చేస్తున్నాడు. నిజంగానే పూరి జగన్నాథ్ కి సినిమా పై అంత నమ్మకం ఉందా ? సినిమా చూసి పూరి కన్నీళ్లు పెట్టుకున్నాడు అని సినిమా యూనిట్ మొత్తానికి సినిమాను బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఇందులో బహుశా నిజం ఉండి ఉండొచ్చు. ఎందుకంటే పూరి ప్రీమియర్ షోల ప్లాన్ చూస్తుంటే.. పూరి సినిమా పై బాగా నమ్మకం పెట్టుకున్నట్లు ఉన్నాడు.
ఎంతైనా పూరి ఒక నిర్మాతగా వ్యవహరించిన చిత్రం ఇది. పైగా ఈ సినిమాకు పూరి కథ, మాటలు, స్క్రీన్ ప్లే కూడా అందించాడు. అందుకే, ఈ సినిమా రిజల్ట్ పై పూరికి అతి నమ్మకం ఉండటంలో వింత ఏమి లేదు. ఇక ప్రీమియర్ షోల విషయానికి వస్తే.. ఈ నెల 27న హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో రాత్రి 8 గంటలకు రొమాంటిక్ సినిమా స్పెషల్ ప్రీమియర్ షో పడబోతుంది. అయితే, ఈ షోకి ప్రముఖులు, క్రిటిక్స్ మాత్రమే ఆహ్వానితులు.