Punith Rajkumar: కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణవార్త యావత్ దేశంలోని సినీ ప్రేక్షకులను కన్నీటి సంద్రంలోకి నెట్టేసింది. శుక్రవారం వ్యాయామం చేస్తున్న సమయంలో ఛాతి నొప్పితో బాధపడిన పునీత్.. బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చేరారు. వెంటనే వైద్యులు ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. చికిత్స తీసుకుంటున్న సమయంలోనే పునీత్ తుదిశ్వాస విడిచారు. పునీత్ కార్డియక్ అరెస్ట్‌తో చనిపోయినట్లు వైద్యులు స్పష్టం చేశారు. దీంతో పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం అందరినీ కలచివేసింది. ఇప్పటికీ పునీత్ మరణ విషాదం నుంచి ఎవరూ కోలుకోలేకపోతున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ.. రీల్ హీరోగానే కాకుండా రియల్ స్టార్‌గా అందరి మనసుల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. ఆయన మరణం తర్వాత కూడా నలుగురు జీవితాల్లో వెగులు నింపాలనే ఉద్దేశంతో తన కళ్లను దానం చేసిన మహానుభావుడు.

అయితే, కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు పునీత్ మరణాన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. పునీత్ కార్డియాక్ అరెస్ట్‌తో మరిణించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి సోషల్‌మీడియా, టీవీ ఛానెల్స్‌లో కార్డియక్ అరెస్ట్‌పై అనేక వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పునీత్ ఫొటో ముద్రించి కార్డియక్ అరెస్ట్ నివారణకు చికిత్స అందిస్తామని కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు నమ్మబలుకుతున్నాయి. పునీత్‌కు శ్రద్దాంజలి పేర్కొంటూనే ఆయన గుండె సంబంధిత వ్యాధితో చనిపోయారని.. గుండె జబ్బులు రాకుండా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు హోర్డింగ్‌లో రాశారు.
కార్డియక్ ప్రొఫైల్ కేవలం రూ.300లకే తెలుసుకోండంటూ పునీత్ మరణాన్ని కొన్ని ఆసుపత్రులు క్యాష్ చేసుకుంటున్నాయి. వీటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు, పునీత్ అభిమానులు వారిని దుమ్మెత్తిపోస్తున్నారు.