
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది. గతేడాది వచ్చిన కరోనాతో తెలుగు ఇండస్ట్రీ పూర్తిగా లాస్ అయింది. థియేటర్లు తెరుచుకోక చాలా మందికి ఉపాధి లేకుండాపోయింది. ఇప్పుడు మరోసారి కరోనా తెలుగు ఇండస్ట్రీని వదలడం లేదు. అయితే.. అది నిర్మాతలు, హీరోలు, దర్శకుల వెంట తిరుగుతోంది. దాని బారిన పడుతున్న వారి లిస్టు రోజురోజుకూ పెరుగుతోంది. మొత్తంగా సినీ ఇండస్ట్రీని కరోనా కమ్మేస్తోంది.
ముఖ్యంగా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అందరినీ చుట్టేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టాలీవుడ్ హీరోయిన్ నివేదా థామస్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సహా పలువురు సినీ నటులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కాగా.. తాజాగా బడా నిర్మాత అల్లు అరవింద్‌కు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌లకు కరోనా సోకిందని వస్తున్న వార్తలు సినీ వర్గాల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి.
ఓవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే అల్లు అరవింద్ రెండుసార్లు వ్యాక్సిన్ తీసుకున్నారు. అయినా ఆయన కరోనా బారిన పడడం షాకింగ్‌లాంటి న్యూస్. ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురైన ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. కోవిడ్- 19 పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం. ఇక ఆయనతోపాటు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా కరోనా మహమ్మారి బారిన పడ్డారని, ప్రస్తుతం వీరిద్దరూ సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.
అల్లు అరవింద్‌కి కారోనా సోకినట్లు అధికారిక సమాచారం లేకపోవడం, మరోవైపు ఆయన కరోనా బారిన పడినట్లు పెద్దఎత్తున వార్తలు వస్తుండటం సినీ వర్గాల్లో గందరగోళ పరిస్థితికి కారణమైంది. మరి ఈ వార్తలపై అల్లు ఫ్యామిలీ గానీ.. త్రివిక్రమ్ టీమ్ గానీ స్పందిస్తుందో చూడాలి.