కరోనాతో సినిమా ఇండస్ట్రీ మొత్తం మూతపడిపోయింది. థియేటర్లు బంద్ అయ్యాయి. అన్నీ అన్ లాక్ తో ఓపెన్ అవుతున్నా థియేటర్లు తెరిచే పరిస్థితి లేదు. తాజాగా కేంద్రం అనుమతిచ్చినా కరోనా భయానికి ప్రజలు ప్రేక్షకులు వచ్చే పరిస్థితి లేదు. కరోనాకు వ్యాక్సిన్ వస్తే తప్ప సినిమా ఇండస్ట్రీ కుదుటపడే పరిస్థితులు కనిపించడం లేదు.
కరోనా వైరస్.. లాక్ డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. షూటింగ్ పూర్తి చేసిన సినిమాలు కూడా విడుదల కాకుండా ఆగిపోయాయి. కొత్త సినిమాల షూటింగ్ లు జరగడం లేదు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి.
నెమ్మదిగా సినిమా షూటింగ్ లు మొదలయ్యాయి. థియేటర్లను 15వ తేది నుంచి తెరవబోతున్నారు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
సినిమాకు 5 లక్షల కంటే ఎక్కువ తీసుకునేవారి పారితోషికంలో 20శాతం తగ్గింపు విధించాలని యాక్టివ్ తెలుగు సినిమా నిర్మాతల గిల్డ్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)తో ఒప్పందం చేసుకుంది. శనివారం ఈ విషయమై సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్ట్ ల ప్రతినిధులు సమావేశమై చర్చించారు. కరోనా ప్రభావం తగ్గే వరకు ఖర్చులు తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక రోజుకు రూ.20వేల కంటే ఎక్కువ తీసుకునే వారి పారితోషికం విషయంలో ఈ మినహాయింపులు ఇచ్చారు.