దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఏ స్థాయిలో విజృంభిస్తోందో అందరికీ తెలిసిందే. రోజుకు 3 లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో.. జనం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సినిమా ఇండస్ట్రీపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే థియేటర్లు మూసేశారు. కొన్ని సినిమాల షూటింగులు కూడా నిలిపేశారు. ఈ పరిస్థితిపై ఇండస్ట్రీ మొత్తం తీవ్ర ఆవేదనతో ఉండగా.. రాజమౌళి మాత్రం హ్యాపీగా ఉన్నాడట!
జక్కన్న చెక్కుతున్న RRR అక్టోబర్ లో రిలీజ్ కావాల్సి ఉంది. అంటే.. ఇంకా ఆర్నెల్ల సమయం ఉంది. రాజమౌళి వేసుకున్న అంచనా ప్రకారం.. ఇప్పటికే చిత్రీకరణ ముగిసిపోవాలి. కానీ.. అలా జరగలేదు. ఇంకా షూటింగ్ పెండింగ్ లో ఉంది. మధ్యలో అనేక కారణాలతోపాటు.. ఇప్పుడు కొవిడ్ కూడా ఇబ్బంది పెడుతోంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదాపడిన ఈ చిత్రం.. మరోసారి కూడా వాయిదా పడుతుందా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతూనే ఉన్నాయి.
అయితే.. RRR టాకీ పార్ట్ పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు చాలా సమయం తీసుకోవాల్సి ఉంది. వీఎఫ్ఎక్స్ వర్క్, డబ్బింగ్, ఎడిటింగ్ వగైరాలు కలుపుకొని కనీసం 6 నెలల సమయం పడుతుంది. అంతకన్నా ఎక్కువే పట్టినా ఆశ్చర్యం లేదు. ఆ లెక్కలు వేసుకున్న తర్వాతనే జక్కన్న దసరా రిలీజ్ ను ప్రకటించాడు.
అంటే.. ఏప్రిల్ లోనే చిత్రం షూట్ ఫినిష్ అవుతుందని, అప్పటి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీద కూర్చుంటే.. దసరా నాటికి కంప్లీట్ చేయొచ్చని భావించాడు దర్శకధీరుడు. కానీ.. ఇంకా.. షూటింగే కాలేదు. RRR డైరీలోంచి కొన్ని పేజీలను చరణ్ ఆచార్యకు ఇవ్వడం.. అలియాభట్ కరోనాకు మరికొన్ని ఇవ్వడం.. ఇంకా మిగిలిన వారు కూడా తలా కొన్ని పేజీలు తీసుకోవడంతో.. షూట్ మరింత ఆలస్యమైంది.
వీటికారణంగా.. ఈ చిత్రం మరోసారి వాయిదా పడుతుందని చాలా కాలంగా ప్రచారం అవుతోంది. యూనిట్ కూడా అదే ఫీలింగ్ లో ఉంది. అయితే.. మూడోసారి కూడా వాయిదా పడితే ట్రోలింగ్ తప్పదనే భయం కూడా ఉంది జక్కన్నలో. ఇలాంటి పరిస్థితి నుంచి సెకండ్ వేవ్ సేవ్ చేసిందని అంటున్నారు. కరోనా తీసుకొచ్చిన ఈ అనివార్య హాలీడేస్ లో.. రాజమౌళి గ్రాఫిక్స్ వర్క్ మీద కూర్చుని, హ్యాపీగా పని ముగించేస్తాడని చెబుతున్నారు. ఆ విధంగా.. కరోనా జక్కన్నకు మంచి చేసిందని విశ్లేషిస్తున్నారు సినీ జనాలు.