Salman Khan: పంజాబీ గాయకుడు సిద్దు మూసే వాలా హత్య కేసు విచారణలో పోలీసులకు దిమ్మ తిరిగిపోయే నిజాలు తెలుస్తున్నాయి. పంజాబీ గాయకుడైన సిద్ధుని హతమార్చిన నిందితులు.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా చంపేందుకు రెక్కి నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వివరాలను పంజాబ్ యాంటీ గ్యాంగ్ స్టర్ టాస్క్ ఫోర్స్ ( ఏ జి టి ఎఫ్) వెల్లడించింది. పశ్చిమ బెంగాల్లోని భారత_ నేపాల్ సరిహద్దుల్లో, నేపాల్ కు పరారయ్యేందుకు యత్నిస్తుండగా వారిని పట్టుకున్నామని అధికారులు చెబుతున్నారు. కాగా సిద్దు మూసే వాలా హత్య కేసులో ఇప్పటివరకు పోలీసులు 23 మందిని అరెస్టు చేశారు.

హత్యకుట్రలో మాస్టర్ మైండ్ లారెన్స్ బిష్ణోయ్
పంజాబ్ సింగర్, కాంగ్రెస్ నాయకుడు సిద్దు మూసే వాలా ను మే 29న కొంత మంది హతమార్చారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు నిర్వహించగా ఈ హత్య కుట్రకు మాస్టర్ మైండ్ గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అని తేలింది. అయితే మే 29న హత్యకు గురైన సిద్దు మూసే వాలా ను తామే హతమార్చమని కెనడాకు చెందిన గ్యాంగ్ స్టార్ గోల్డీ బ్రార్ ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ చేశాడు. గోల్డీ బ్రార్ బిష్ణోయ్ అనుచరుడు. దీంతో హత్య జరిగిన నాటి నుంచి బిష్ణోయ్ పై పోలీసులకు అనుమానం నెలకొంది. ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా పోలీసులు లారెన్స్ పేరును చేర్చారు. అయితే నేరాన్ని అంగీకరించని లారెన్స్ బిష్ణోయ్.. తన ప్రమేయం లేకుండానే తన గ్యాంగ్ ఈ హత్యకు పాల్పడిందని స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేవిధంగా తనకు గోల్డీ తో సంబంధాలు ఉన్నట్లు అంగీకరించాడు. ఈ క్రమంలో పలువురిని అరెస్టు చేసిన పోలీసులు.. వాళ్లు ఇచ్చిన సమాచారం మేరకు లారెన్స్ బిష్ణోయ్ ఈ హత్య కుట్రకు ప్రధాన సూత్రధారిగా తేల్చారు. ప్రస్తుతం ఢిల్లీ తీహార్ జైల్లో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ ను ఇప్పటికే పోలీసులు పలుమార్లు ప్రశ్నించారు కూడా. ఇక పోలీసుల అదుపులో ఉన్న నిందితుల సమాచారం మేరకు ఆరు బృందాలను ఏర్పాటు చేసిన పంజాబ్ పోలీసులు.. ఆరుగురు షార్ప్ షూటర్ల కోసం నాలుగు రాష్ట్రాలను జల్లెడ పట్టారు.
కేంద్ర ఏజెన్సీ లతో కలిసి
మూసే వాలా పై కాల్పులు జరిపిన ఆరుగురు నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరిని పంజాబ్ పోలీసులు కేంద్ర ఏజెన్సీ లతో కలిసి చేపట్టిన ఆపరేషన్ లో హతమార్చారు. పంజాబ్ లోని అమృత్ సర్ జిల్లాలోని పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు అట్టారీ బార్డర్ కు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న హోషియార్ నగర్ లో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో సిద్దు హత్య కేసులో ప్రమేయం ఉందని భావిస్తున్న ఇద్దరు గ్యాంగ్ స్టర్స్ జగ్గు సింగ్, మన్ ప్రీత్ సింగ్ ను పోలీసులు హతమార్చారు. పోలీసులకు, గ్యాంగ్ స్టర్లకు మధ్య జరిగిన ఓ వార్తా ఛానల్ కెమెరా పర్సన్ కి కూడా గాయాలయ్యాయి. అతని కుడి కాలు లోకి బుల్లెట్ దూసుకెళ్లింది. హతమైన ఇద్దరు నిందితులు పంజాబ్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న తర్న్ తరన్ గ్రామానికి చెందినవారు. పక్కా సమాచారంతో పోలీసులు వారు ఇద్దరు ఉన్న ప్రాంతాన్ని చేరుకున్నారు. ముందు జాగ్రత్తగా ప్రజల్ని ఇళ్లలోనే ఉండాలని పోలీసులు సూచించారు. పంజాబ్ పోలీసులు, కేంద్ర ఏజెన్సీలో ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్నాయి. కాగా సిద్దు పై తొలుత ఏకే 47 తో మన్ ప్రీత్ సింగ్ కాల్పులు జరిపాడనే ఆరోపణలు ఉన్నాయి.

మిగతా వారిని పట్టుకున్నారు
పరారీలో ఉన్న దీపక్ ముండీ, అతని ఇద్దరు సహచరులు కపిల్ పండిట్, రాజేందర్ ను పశ్చిమ బెంగాల్_ నేపాల్ సరిహద్దుల్లో పంజాబ్ పోలీసులు పట్టుకున్నారు. ఇంటలిజెన్స్ ఇచ్చిన సమాచారం మేరకు వారిని పశ్చిమ బెంగాల్- నేపాల్ సరిహద్దుల్లో పట్టుకున్నారు. సిద్దు పై కాల్పులకు పాల్పడిన నిందితుల్లో దీపక్ ఒకరు. కపిల్ పండిట్, రాజేందర్ ఆయుధాలు, ఆశ్రయం తో పాటు ట్రాన్స్ పోర్ట్ సాయం అందించారు. ముఠా కక్షల కారణంగానే సిద్దూను హత్య చేసినట్టు అనుమానించిన పోలీసులు ఆ దిశగానే దర్యాప్తు చేపట్టారు. ఇప్పటివరకు 23 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నిందితులు సల్మాన్ ఖాన్ ను ఎందుకు హతమార్చాలని అనుకున్నారో పూర్తి విచారణలో తీరుతుందని ఏజిటిఎఫ్ పోలీసులు అంటున్నారు. కాగా నిందితులను ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించిన పోలీసులు.. కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారుల ఆధ్వర్యంలో విచారణ నిర్వహిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసు అధికారులు చెబుతున్నారు.
Also Read:Bigg Boss 6 Telugu Revanth: మరో కౌశల్ కాబోతున్న రేవంత్..? బిగ్ బాస్ స్కెచ్ మాములుగా లేదుగా
[…] […]