Comedian Raja Babu: అది 1935 వ సంవత్సరం.. అక్టోబరు 20వ తేదీ.. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో పుట్టాడు ఓ పిల్లాడు. అప్పుడు నర్సాపురం ప్రజలు ఉహించలేదు. ఆ పిల్లాడే తెలుగు సినిమా హాస్య చక్రవర్తి అవుతాడని. పిల్లాడికి ‘పుణ్యమూర్తుల అప్పలరాజు’ అని పెట్టారు అతని తల్లిదండ్రులు శ్రీ పుణ్యమూర్తుల ఉమామహేశ్వర రావు , శ్రీమతి రవణమ్మ. ఎందుకో తెలియదు గానీ, పిల్లాడు ఎంత తిన్నా బక్కచిక్కిన వాడిలానే ఉండేవాడు.

నిడదవోలులోని పాఠశాల చదువు చదువుతూనే బుర్రకథ నేర్చుకోవడానికి శ్రీ అచ్యుత రామయ్య గారి దగ్గర చేరాడు. అలా ఆయన సహకారంతో నాటకాలలో పాలుపంచుకున్నాడు. ఈ లోపు ఆ పుణ్యమూర్తుల అప్పలరాజు లక్ష్మీ అమ్ములును వివాహమాడాడు, నాగేంద్రబాబు, మహేశ్ బాబు అనే ఇద్దరు బిడ్డలు పుట్టారు. పుట్టిల్లు సినిమా దర్శకుడు గరికపాటి రాజారావు ఒక సారి నాటకంలో అప్పలరాజును చూశాడు. సినిమాలలో చేరవయ్యా అని ఉత్సాహపరిచాడు.
దాంతో ఇంట్లో చెప్పాపెట్టకుండా అప్పలరాజు మద్రాసు చేరుకొన్నాడు. పూట గడవడం కష్టం అయిపోయింది. ఎన్నో పనులు చేశాడు. హాస్యనటుడు అడ్డాల నారాయణరావు సినిమాలో అవకాశం కల్పించాడు. దశ తిరిగింది. ‘అప్పలరాజు’ కాస్త ‘రాజబాబు’ అయ్యాడు. వరుస అవకాశాలు వచ్చాయి. స్వర్ణగౌరి చిత్రానికి గాను 350 రూపాయలు మొట్టమొదటి పారితోషికంగా స్వీకరించాడు.
తరువాత వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుసగా ఎన్నో చిత్రాలలో కీలక పాత్రల్లో నటించాడు. ముఖ్యంగా అప్పట్లో రాజబాబు-రమాప్రభ జోడీకి మంచి హాస్య జంటగా పేరు తెచ్చుకుంది. ఆ క్రేజ్ కారణంగానే రాజబాబు ‘తాతా మనవడు’, పిచ్చోడి పెళ్ళి, తిరుపతి, ఎవరికి వారే యమునా తీరే, మనిషి రోడ్డున పడ్డాడు లాంటి సినిమాలలో హీరోగా కూడా నటించి మెప్పించాడు.
వరుసగా ఏడు సార్లు ఫిలింఫేర్ అవార్డు పొందిన మొట్టమొదటి హాస్యనటుడు కూడా రాజబాబునే. రాజబాబు జీవితంలో మొత్తం తొమ్మిది ఫిలింమ్ ఫేర్ అవార్డులు, మూడు నంది బహుమతులు పొందాడు. 1983 ఫిబ్రవరి 14న రాత్రి గొంతులో ఏదో ఇబ్బంది వచ్చి హైదరాబాదు లోని థెరెసా ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు రాజబాబు.
అదే రోజున తెలుగు సినీ అభిమానుల్ని శోక సముద్రంలో ముంచి స్వర్గస్తుడయాడు. ఈ రోజు ఆ హాస్య చక్రవర్తి జయంతి సందర్భంగా రాజబాబు గారికి మా ఓకేతెలుగు.కామ్ ఘన నివాళులర్పిస్తోంది.