లాక్డౌన్ కారణంగా టాలీవుడ్లో సుమారు మూడునెలలుగా షూటింగులు వాయిదా పడగా, థియేటర్లు మూసివేసిన సంగతి తెల్సిందే. కేంద్రం ఇటీవల అన్ని రంగాలకు షరతులతో కూడిన పర్మిషన్ ఇస్తుండటంతో షూటింగులు, థియేటర్లు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీని పెద్దలు ప్రభుత్వాన్ని విజ్క్షప్తి చేశారు. ఈమేరకు ప్రముఖులు పలుసార్లు సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి త్వరలో షూటింగులు ప్రారంభమయ్యేలా చర్చించారు. చిత్రసీమను నమ్మకొని వేలాది మంది కార్మికులు జీవిస్తున్నారని షూటింగులు ప్రారంభమైతేనే వారికి ఉపాధి దొరకుతుందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా టాలీవుడ్లో నెలకొన్న సమస్యలను కేసీఆర్ ను వివరించగా ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రగతిభవన్లో నేడు సుదీర్ఘంగా సమీక్షలు నిర్వహించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సినిమా, టీవీ షూటింగులకు సంబంధించిన అనుమతి ఇస్తూ సంతకం చేశారు.
టాలీవుడ్లో షూటింగుల సందడి షూరు..
ముఖ్యమంత్రి కేసీఆర్ సినిమా, టీవీ సీరియల్స్ సంబంధించి నేడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొవిడ్-19 మార్గదర్శకాలు, లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ షూటింగ్‌లు నిర్వహించుకునేలా తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పరిమిత సంఖ్యలో సిబ్బంది షూటింగ్‌లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. సినీ పెద్దలతో జరిగిన మీటింగుల్లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ సినిమాలకు సంబంధించి పోస్టు ప్రొడక్షన్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదేవిధంగా షూటింగులకు సంబంధించి మార్గదర్శకాలను తయారుచేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులను ఆదేశించిన సంగతి తెల్సిందే. తాజాగా సీఎం కేసీఆర్ ఇందుకు సంబంధించిన జీవోపై సంతకం చేయడంతో టాలీవుడ్లో షూటింగుల సందడి మొదలు కానుంది.
థియేటర్ల పరిస్థితి ఏంటీ?
తాజాగా సీఎం కేసీఆర్ సినిమా, టీవీలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అయితే థియేటర్లు తెరిచేందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. దీంతో థియేటర్లు ఎప్పుడు తెరుస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఇప్పట్లో వీటికి అనుమతి ఇవ్వలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. థియేటర్ల ఓపెనింగ్ కు మరి కొన్ని రోజులు ఆగాల్సిందేనని చెబుతున్నారు. సినిమా, టీవీ షూటింగులకు అనుమతి లభించడంతో టాలీవుడ్లోని ఓ వర్గం సంతోషం వ్యక్తం చేసింది. మరోవైపు థియేటర్లకు అనుమతి లభించకపోవడంతో కొంచెం కష్టంగా మారిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా రెండున్నర నెలలుగా నిలిచిపోయిన సినిమా, టీవీ షూటింగులు తిరిగి ప్రారంభం కానుండటంతో సినీ పెద్దలు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.