Online Movie Ticket Issue: తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాతలు, థియేటర్ యజమానులు అందరూ కలిసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో భేటీ అయి.. సినిమాల రిలీజ్ వ్యవహారాల పై చర్చించారు. ఈ చర్చలో ముఖ్యంగా ప్రస్తావించిన అంశం ఆన్ లైన్ టికెట్ల గురించే. ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ ఆన్ లైన్ టికెట్లే ఉండాలని పట్టుబడుతోంది. జగన్ ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు.
కానీ ఆన్ లైన్ టికెట్లు అమలు చేస్తూ ముందుకు పోతే పెద్ద సినిమాల కలెక్షన్స్ పై భారీగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అందుకే, ఎట్టిపరిస్థితుల్లో అలా చేయకండి అంటూ తెలుగు చిత్రసీమ ప్రతినిధులు మంత్రి పేర్ని నానిని రిక్వెస్ట్ చేశారు. అయితే, పెద్ద సినిమాల విషయంలో జగన్ తో మాట్లాడి ఫైనల్ చేద్దాం అంటూ పేర్ని నాని చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే త్వరలోనే సీఎం జగన్ తో భేటీ కూడా కావాలని సినీ పెద్దలు నిర్ణయించుకున్నారు. ఇక ఈ చర్చలో చర్చించిన అంశాల గురించి ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘ఆన్ లైన్ టికెట్ విధానం పై చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అయితే, ఆన్ లైన్ టికెట్ విధానం మేమే అడిగామని కళ్యాణ్ చెప్పుకొచ్చారు. కానీ ఈ భేటీ ముందు వరకు సినీ పెద్దలు ఆన్ లైన్ టికెట్ విధానాన్ని వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు మళ్ళీ మాట మార్చారు.
అలాగే 4 షోలు 12 గంటల లోపు పూర్తి చేయడంపై కూడా మేము చర్చించాం అని కళ్యాణ్ అన్నారు. ఇదే క్రమంలో విద్యుత్ బిల్లుల అంశం, 100 శాతం ఆక్యుపెన్సీ పై కూడా చర్చించినట్లు తెలిపారు. త్వరలోనే సీఎం జగన్ తో భేటీ అయి.. సినిమా ఇండస్ట్రీ కి కావాల్సినవి అన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తాము అని సి. కళ్యాణ్ వెల్లడించారు.