50 Monuments : గత చరిత్రకు ఆనవాళ్ళుగా నాటి కట్టడాలు నిలుస్తాయి.. అయితే వీటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే భవిష్యత్తు తరాలకు నాటి చరిత్రను గురించి తెలుస్తుంది. వాటిని కాపాడకపోతే నాటి చరిత్ర గురించి తెలిసే అవకాశం ఉండదు.. ఇక వారసత్వ కట్టడాల పరిరక్షణలో అటు కేంద్రం , ఇటు రాష్ట్రం పూర్తిగా విఫలమవుతున్నాయి. సనాతన చరిత్రకు ఆలవాలంగా నిలిచిన భారతదేశంలో ఎన్నో కట్టడాలు కాలగర్భంలో కలిసిపోయాయి.. ఒకవేళ వీటిని కనుక పరి రక్షించి ఉంటే భారత్ ఒక హెరిటేజ్ సిటీ గా ఉండేది.. తాజాగా 50 స్మారక చిహ్నాలు కాలగర్భంలో కలిసిపోయాయని కేంద్ర ప్రభుత్వం చెప్పడం గమనార్హం. ఉత్తరప్రదేశ్లో 11, ఢిల్లీ, హర్యానాలో ఒక్కొక్కటి, అస్సాం, పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అనేక స్మారక చిహ్నాలు కాలగర్భంలో కలిసిపోయాయి.. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు సమర్పించిన నివేదిక ప్రకారం భారతదేశంలోని 3,693 కేంద్రీయ రక్షిత స్మారక చిహ్నాలలో 50 వరకు కనుమరుగైపోయాయి.

ఇవీ కారణాలు
భారత పురావస్తు శాఖ రక్షణలో జాతీయ ప్రాముఖ్యత కలిగిన అనేక స్మారక చిహ్నాలు పట్టణీకరణ కారణంగా వాటి ఆనవాళ్లు కోల్పోయాయి. మరికొన్ని గుర్తించిన విధంగా మారిపోవడం, జలాశయాల మన సమయంలో ముని పోవడం, మారుమూల ప్రాంతాల్లో గుర్తించడంలో ఇబ్బందులు ఎదురవటం…వంటి వాటి వల్ల చారిత్రక కట్టడాల ఆనవాళ్లు కనిపించడం లేదని తెలుస్తోంది.. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం వీటిలో 14 స్మారక చిహ్నాలు వేగవంతమైన పట్టణీకరణ కారణంగా ఆనవాళ్లు కోల్పోయాయి.. వీటిలో 12 రిజర్వాయర్లు లేదా ఆనకట్టల ద్వారా మునిగిపోయాయి. 24 చిహ్నాల ఆనవాళ్లు కనిపించలేదు..1930, 40, 50 దశకాల్లో కేంద్రీయంగా సంరక్షించిన స్మారక చిహ్నాలలో ఎక్కువ భాగం గుర్తించాయి. స్వాతంత్రం అనంతరం ప్రభుత్వం ఇటువంటి చిహ్నాలను కనుగొనందుకు దృష్టి సారించినప్పటికీ అది పెద్దగా ఫలితం ఇచ్చిన దాఖలాలు కనిపించలేదు.
ఇలా వెలుగులోకి
పార్లమెంటరీ కమిటీ కాగ్ చేత కాలగర్భంలో కలిసిపోయినట్టు ప్రకటించిన 92 స్మారకాలలో 42 ఏఎస్ ఐ చేసిన ప్రయత్నాల కారణంగా వెలుగులోకి వచ్చాయి. మిగిలిన 50 స్మారక చిహ్నాల జాబితాలో వేగవంతమైన పట్టణీకరణ కారణంగా 14 ప్రభావితమయ్యాయి.. 12 కాలగర్భంలో కలిసిపోయాయి.. వివిధ రిజర్వాయర్ల నిర్మాణాల వల్ల 24 చిహ్నాల స్థానాలు గుర్తించలేదు. కాగ్ ఆడిట్ లో ఏఎస్ ఐ తో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న 3678 కేంద్ర రక్షితస్మానిక చిహ్నాలలో కేవలం 165 స్మారక చిహ్నాల భౌతిక తనిఖీని చేర్చారు. 1,655 స్మారక చిహ్నాలలో 24 చిహ్నాల జాడ వెలుగులోకి రాలేదు.
హైదరాబాదులోనూ..
ఇక రాష్ట్ర ప్రభుత్వం తీరు కూడా ఇంతకంటే గొప్పగా ఏమీ లేదు. హెరిటేజ్ సిటీగా పేరుపొందిన హైదరాబాదులో ఎన్నో చారిత్రక కట్టడాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఇటీవల మెట్ల బావిని పునరుద్ధరించిన రాష్ట్ర ప్రభుత్వం… చారిత్రక కట్టడాల పరిరక్షణ తమ ధ్యేయమని పేర్కొన్నది. ఈ ఎనిమిది సంవత్సరాల లో కట్టడాల పరిరక్షణకు తీసుకున్న చర్యలు దాదాపు శూన్యం.. అటు కేంద్రం కానీ, ఇటు రాష్ట్రం కానీ బడ్జెట్లో పురావస్తు శాఖకు కేటాయిస్తున్న నిధులు కూడా అత్యంత స్వల్పం. అసలు నిధులే లేనప్పుడు ఆ శాఖ అధికారులు మాత్రం ఏం చేయగలుగుతారు? కొంతమంది ఔత్సాహికులు పరిశోధనలు జరిపితే తప్ప పురాతన ఆనవాళ్లు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీనివల్ల తెలుసుకోవాల్సిన చరిత్ర మొత్తం మరుగున పడుతుంది. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే చారిత్రక చిహ్నాలు ఆనవాళ్లు కనిపించడం లేదంటూ పార్లమెంట్లో ప్రకటించింది అంటే ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు.