Chiranjeevi: అల్లు రామలింగయ్య 100వ జయంతి నేడు. తెలుగు సినీ ప్రేక్షకుల అందరి మనస్సుల్లో అల్లు రామలింగయ్య తన హాస్యంతో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా రాజమండ్రిలో పర్యటించారు. అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియో కళాశాలలో ఆయన కాంస్య విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘అల్లు రామలింగయ్య గారికి, నాకు గురు శిష్యుల అనుబంధం ఉంది. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఒక్క నటుడిగా కొనసాగుతూనే కాకుండా.. ఆయన హోమియోపతి పై కూడా ఎంతో పట్టు సాధించారు. ఆయన ఎప్పుడు నిత్య విద్యార్థిలానే కష్టపడ్డారు. ఆయన ఎంతో మందికి సేవ చేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కోట శ్రీనివాసరావు, మురళీ మోహన్ వంటి సినీ ప్రముఖులు సహా ఎంతోమందికి ఆయన చికిత్స అందించారు.
గతంలో నేను ఓసారి కడుపునొప్పితో బాధపడుతుంటే ఆయన హోమియోపతి చికిత్సతో దాన్ని పూర్తిగా నయం చేశారు. ఇంతవరకు నాకు మళ్లీ ఆ సమస్య ఎదురుకాలేదు. ఇప్పటికీ నాతో పాటు నా పిల్లలు, వాళ్ల పిల్లలు కూడా హోమియోపతి ని ఫాలో అవుతున్నాం’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు. అల్లు రామలింగయ్య 1922 అక్టోబరు 1న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో జన్మించారు.
అల్లు రామలింగయ్యకి నాటకాలు అంటే ఎంతో మక్కువ. ఆ ఆసక్తితోనే ఊర్లు తిరుగుతూ నాటకాలు వేస్తూ ఉండేవారు. చివరకు నటన పై మక్కువతో సినిమా రంగంలోకి వచ్చారు. ‘పుట్టిల్లు’ అనే చిత్రంతో అల్లు రామలింగయ్య తొలిసారి మేకప్ వేసుకున్నారు. వేయికి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. 1990లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీని కూడా అందుకున్నారు.