
Chiranjeevi- Mallidi Vasishta: మెగాస్టార్ చిరంజీవి మార్కెట్, మేనియా మీదున్న అనుమానాలన్నీ వాల్తేరు వీరయ్య పటాపంచలు చేసింది. హిట్ పడితే వందల కోట్ల వసూళ్లు ఆయనకు సాధ్యమే అని నిరూపించింది. దర్శకుడు కేఎస్ బాబీ తెరకెక్కించిన మాస్ మసాలా ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్య సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. వాల్తేరు వీరయ్య విజయం చిరంజీవిలో హుషారు పెంచింది. భోళా శంకర్ మూవీ చకచకా పూర్తి చేస్తున్నారు. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న భోళా శంకర్ మరో ఊరమాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. కీర్తి సురేష్, తమన్నా నటిస్తుండగా ఆగస్టు 11న వరల్డ్ వైడ్ విడుదల కానుంది.
ఏడాది వ్యవధిలో చిరంజీవి మూడు చిత్రాలు విడుదల చేశారు. మరో ఐదు నెలల్లో భోళా శంకర్ థియేటర్స్ లో దిగనుంది. అయితే చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సైన్ చేయలేదు. ఎలాంటి అధికారిక ప్రకటన జరగలేదు. ఛలో ఫేమ్ వెంకీ కుడుములతో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యిందన్నారు. కానీ వారి కాంబో పట్టాలెక్కలేదు. అందుకే వెంకీ కుడుముల హీరో నితిన్ తో ప్రాజెక్ట్ ప్రకటించారు.
కాగా ఓ యంగ్ డైరెక్టర్ కి చిరంజీవి ఆఫర్ ఇచ్చాడనేది లేటెస్ట్ టాక్. బింబిసార మూవీతో ఇండస్ట్రీని ఆకర్షించిన దర్శకుడు వశిష్ట మల్లిడి మెగాస్టార్ తో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. సోసియో ఫాంటాసీ జోనర్లో ఈ చిత్రం తెరకెక్కుతుందట. ఓ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు నిర్మించే అవకాశం దక్కించుకుందట. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ నిర్మించనున్నారట. ఈ మేరకు చిరంజీవి-వశిష్ట సైన్ చేశారనే వాదన గట్టిగా వినిపిస్తోంది.

బింబిసార కళ్యాణ్ రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఉంది. అంచనాలు లేకుండా విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ క్రమంలో చిరంజీవిని వశిష్ట ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి నెలకొంది. చిరంజీవి-వశిష్ట ప్రాజెక్ట్ పై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. గతంలో చిరంజీవి సైరా నరసింహారెడ్డి పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేశారు. చిరంజీవి కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో సైరా చిత్రం ఉంది.