కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. జనాలు ఆక్సీజన్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ చాలా మందికి ఆక్సీజన్ అందుబాటులోకి రావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఆక్సీజన్ కు చాలా డిమాండ్ పెరిగింది.
ఈ సమస్య పరిష్కారం కోసం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ చేస్తున్న ప్రయత్నాన్ని మెగాస్టార్ చిరంజీవి కొనియాడారు. ఈ మేరకు ట్విట్టర్లో ఓ పోస్టు పెట్టారు. ‘లెట్స్ థింక్’ అంటూ ఆయన షేర్ చేసిన పోస్టు అందరినీ ఆలోచింపజేస్తోంది. ఇంతకీ.. ఆ పోస్టులో ఏముందంటే..?
‘‘దేశమంతా ఆక్సీజన్ దొరక్క కరోనా పేషెంట్స్ అల్లాడిపోతున్నారు. ఈ రోజు ఓ స్పెషల్ ట్రైన్ విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చేరింది. అక్కడ నుంచి 150 టన్నుల ఆక్సీజన్ ను మహారాష్ట్ర తీసుకెళ్తోంది. విశాఖ ఉక్కు కర్మాగారం రోజుకు సుమారు 100 టన్నుల ఆక్సీజన్ ను ఉత్పత్తి చేస్తోంది. ఇప్పుడున్న అత్యవసర పరిస్థితుల్లో ఎన్నో రాష్ట్రాలకు ఆక్సీజన్ అందించి, లక్షల మంది ప్రాణాలను నిలబెడుతోంది. అలాంటి విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో ఉందని, ప్రైవేటుపరం చేయడం ఎంత వరకు సమంజసం? మీరే ఆలోచించండి’’ అంటూ పోస్టు చేశారు.
ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చిరుకు మద్దతుగా పలువురు కామెంట్ చేస్తున్నారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయబోతున్నట్టు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై సినీ ఇండస్ట్రీ నుంచి గతంలోనే స్పందించిన చిరు.. తాజాగా మరోసారి ట్వీట్ చేశారు.